మణుగూరు టౌన్, జూన్ 15 : శాసనసభ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్.. ప్రజలను అన్ని రంగాల్లో నట్టేట ముంచిందని, రాష్ర్టానికి శనిలా దాపురించిన కాంగ్రెస్‌ను రాబోయే ఎన్నికల్లో తరిమికొట్టేందుకు అంతా సమష్టిగా పనిచేయాలని ఎమ్మెల్సీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. మణుగూరు పట్టణంలోని గుట్టమల్లారంలో గల ఓ ఫంక్షన్ హాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్), సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సన్నాహక సమావేశం సోమవారం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన రవీందర్రావు మాట్లాడుతూ సమగ్ర ఓటరు నమోదు కార్యక్రమం ఈ నెల 25 నుంచి జూలై 25వ తేదీ వరకు జరగనున్నదని, ఇందుకోసం బీఆర్ఎస్ తరఫున బూత్ లెవల్ ఏజెంట్(బీఎల్ఏ)లను నియమించి వారికి శిక్షణ కూడా ఇచ్చామని తెలిపారు. అలాగే పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, దీని గురించి కూడా పూర్తిస్థాయిలో అవగాహన కల్పించామన్నారు. గత కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కచ్చితంగా గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి దిండిగల రాజేందర్ మాట్లాడుతూ రేవంత్ సర్కార్ రెండున్నరేళ్లలో అభివృద్ధిని విస్మరించి, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నదని మండిపడ్డారు. రైతు బంధు, రైతుభరోసాతో రైతులను అన్ని విధాల ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. ప్రజలను మోసం చేసే పార్టీ మనది కాదని, కాంగ్రెసోళ్ల మాయమాటలు నమ్మి ఓటు ఎందుకు వేశామా అని ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు గోస పడుతున్నారని, ఇప్పుడు ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే సినిమా సగం అయిందని, ఇక ైక్లెమాక్స్ మనం చూపించాలన్నారు. పినపాక నియోజకవర్గ అభివృద్ధిలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర పెద్దదని అన్నారు. నాలుగున్నర లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దేనని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేగాను ఓడించడానికి రాష్ట్ర నాయకులే కాకుండా కేంద్ర నాయకులు కూడా వచ్చారని, అంటే రేగా సత్తా ఏమిటో వారికి తెలుసని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. సింగిల్ ఎజెండాతో ఏ ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ గెలవాలని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. పార్టీ ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతీ నాయకుడు, కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ రవీందర్రావుతోపాటు దిండిగల రాజేందర్‌ను శాలువా కప్పి సన్మానించారు. అన్ని మండలాల బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.