మణుగూరు టౌన్, డిసెంబర్ 3 : ఏడాది పాలనలో ఏం సాధించారని విజయోత్సవాలు చేసుకుంటున్నారో కాంగ్రెస్ నాయకులకే తెలియాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తుపాకీ రాముడిని మైమరిపించే విధంగా ఉందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఎద్దేవా చేశారు. మణుగూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీల పేరుతో.. 420 మోసాలతో ప్రజలను మోసం చేసేందుకు సంబురాలు చేసుకుంటున్నారా.. అని ప్రశ్నించారు. కలుషిత ఆహారం విషయమై రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలను సందర్శిస్తున్న ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్‌పై స్థానిక ఎమ్మెల్యే విమర్శలు చేయడంపై ఆయన ధ్వజమెత్తారు.
విద్యార్థులకు భవిష్యత్‌ను ఇచ్చే ధైర్యం లేక.. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించలేక.. జరిగిన తప్పును పరిష్కరించే తెలివితేటలు లేక సందర్శనకు వచ్చిన వారిపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఏడాది కాలంలో 46 మంది విద్యార్థులు మృతిచెందితే కనీసం సీఎం, మంత్రులు రివ్యూ సమావేశం నిర్వహించలేదన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అదానీ ఇచ్చిన రూ.వంద కోట్లు తిరిగి ఇచ్చింది నిజం కాదా.. అని ప్రశ్నించారు. అధికారం ఉందని విర్రవీగి మా పార్టీ నేతలు, నాయకులను విమర్శిస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ముత్యం బాబు, కుర్రి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్, నూకారపు రమేశ్, ఉద్దంగుల కృష్ణ, బొలిశెట్టి నవీన్, రవి తదితరులు పాల్గొన్నారు.