కూసుమంచి, అక్టోబర్ 3: కుటుంబ డిజిటల్ కార్డుల జారీ దేశంలోకెల్లా తెలంగాణలోనే మొదటిసారిగా జరుగుతోందని మైనింగ్ శాఖ సెక్రటరీ, జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ పేర్కొన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో తప్ప మరెక్కడా ఇలాంటి కార్డులు లేవని గుర్తుచేశారు. డిజిటల్ కార్డుల జారీ కోసం ఒక్కో నియోజకవర్గంలో రెండు గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కుటుంబ సర్వేను చేస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన ధర్మాతండాలో గురువారం ఆయన పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న కుటుంబ సర్వేను పరిశీలించారు.
సర్వే తీరుతెన్నుల గురించి ఇటు సిబ్బందిని, అటు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుటుంబ డిజిటల్ కార్డుల నయోదు ప్రక్రియ గురువారం మొదలైందిన అన్నారు. శుక్రవారం నుంచి జిల్లా కేంద్రాల్లో డేటాను ఎంట్రీ చేస్తామని అన్నారు. వివరాల నమోదు, డేటా ఎంట్రీ సమయాల్లో తప్పులు దొర్లితే తర్వాత అనేక ఇబ్బందులుండే అవకాశం ఉన్నందున తప్పిదాలు లేకుండా ప్రక్రియను పూర్తిచేస్తామని అన్నారు.
ధర్మాతండాలో ఇంటింటికీ వెళ్లి 150 ఇళ్ల సర్వేను పూర్తి చేస్తామన్నారు. అధికారులు కుటుంబ సర్వే కోసం వస్తున్నందున ప్రజలు తమ ఆధార్ కార్డులు సహా ఇతర ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలు ఇళ్లలో అందుబాటులో ఉన్న సమయంలోనే సర్వే చేస్తామన్నారు. ఒకవేళ గ్రామంలో సర్వే జరిగిన రోజు వివరాలను నమోదు చేయించుకోలేకపోతే ఎవ్వరూ కంగారు పడాల్సిన పనిలేదని అన్నారు. ఈ నెల 9 వరకు గ్రామాల్లో సర్వే చేస్తామని తెలిపారు.
ప్రతి కుటుంబంలోనూ ఇంటి పెద్దగా మహిళ పేరిటే కార్డులు జారీ చేస్తామన్నారు. ఈ సర్వే పర్యవేక్షణ కోసం ప్రతీ నియోజకవర్గంలో ఒక జిల్లాస్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించినట్లు చెప్పారు. డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి, ఇతర అధికారులు వేణుగోపాల్ రెడ్డి, కరుణశ్రీ, రాము, వసంత, జ్యోతి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.