ఆనాటి కాంగ్రెస్ పాలనలో పంటలు పండించుకోవాలంటే నరకయాతన పడేది. రైతులకు సాగు భూములున్నా సమృద్ధిగా నీళ్లు లేక.. వేళకు కరెంటు రాక.. అడపా దడపా వచ్చిన కరెంటుతో పంటలు పండక అవస్థలు పడ్డారు. లాంతర్లు, టార్చిలైట్లు పెట్టుకొని రాత్రుళ్లు పంట భూముల వద్దే జాగారాలు చేశారు. కాంగ్రెసోళ్లు ఇచ్చిన కరెంటుతో మడి తడవక ముందే కరెంటుపోయేది. ఒక్క మడి పారాలంటే రోజులు పట్టేది. ఏటేటా ఇదే తంతు.. అవే అవస్థలు. స్వరాష్ట్రంలో రైతుబిడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సమస్యలన్నింటికీ పరిష్కారం చూపారు. పంటలకు నీరే ఆధారమని చెరువులను మిషన్ కాకతీయ పథకం కింద మరమ్మతు చేయించారు. 24 గంటల ఉచిత విద్యుత్ నిరంతరాయంగా ఇచ్చి రెండు పంటలు పండించుకునేలా చేశారు. భూ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తెచ్చి రైతుల భూములు పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకునేలా చేశారు. మధ్యదళారుల ప్రమేయం లేకుండా పట్టాదారు పాస్‌బుక్‌లు వచ్చేలా చేశారు. దీనిని జీర్ణించుకోలేని కాంగ్రెసోళ్లు.. రైతులు పంటలు పండించుకునేందుకు 3 గంటల విద్యుత్ సరిపోతుందని, 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకొని నీరు పారించుకోవచ్చని తలాతోకా లేని మాటలు చెబుతున్నారు. ధరణి పోర్టల్‌ను తొలగించి పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామని ప్రగల్భాలు పలకడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అన్నివేళల్లో రైతుల పక్షాన నిలబడే బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు అని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు.
ఖమ్మం, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరెంటు మాటెత్తితే కాంగ్రెసోళ్లను కాట్లెకలపడం తప్పదంటున్నారు గ్రామాల్లోని రైతులు, మహిళలు. అప్పట్లోనే ఏడు గంటల కరెంటిస్తామని చెప్పి గద్దెనెక్కి రెండు గంటలు కూడా ఇవ్వకుండా మా రైతులందరినీ ముప్పు తిప్పలు పెట్టారంటూ మండిపడుతున్నారు. మళ్లీ ఇప్పుడొచ్చి మూడు గంటల కరెంటు చాలని, పెద్ద మోటర్లు పెట్టుకోవాలని ఉచిత సలహాలిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు చెబుతున్న ‘మూడు గంటల కరెంటు, 10హెచ్‌పీ మోటర్లు, ధరణి పోర్టల్ రద్దు’ వంటి అంశాలపై గ్రామీణ ప్రాంతాల రైతులు, మహిళలు, వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల నిరంతర విద్యుత్, వివాదాలకు తావులేకుండా ధరణి పోర్టల్ వంటివి అటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నాయి. పైగా ఇటు రైతులకూ ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. ఈ విషయాలు మిండుగు పడని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై నిందలు వేసి ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి దుర్బుద్ధిని గమనించిన గ్రామీణ ప్రాంత ప్రజలు, మహిళలు, రైతులు కాంగ్రెస్ నాయకుల అసలు బండారాన్ని, వారి మాటల వెనుక ఉన్న కపటాన్ని బయటపెడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెసోళ్లకు కన్నుకుట్టబట్టే కరెంటుపై కట్టు కథలు చెబుతున్నారని, కారుకూతలు కూస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాడెద్దులతో కర్షకులు పడే కష్టాలు వ్యవసాయం చేయని కాంగ్రెస్ నేతలకు ఏం తెలుస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు. సాగుదారుల కష్టాలు తెలిసిన కేసీఆర్ ప్రభుత్వం ఉండగా తమకు మరెవ్వరూ అక్కరలేదని నొక్కి చెబుతున్నారు.
గతంలో వ్యవసాయ భూముల రికార్డుల కోసం బాధలు అన్నీ ఇన్నీ కావు. పహాణీలో తప్పులు సరిచేసుకోవడానికి, పేర్లు మార్పిడి కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరిగేది. వీఆర్వోలకు, ఆర్ఐలకు ఎంతో కొంత డబ్బు ముట్టచెప్పనిదే పనులయ్యేవి కావు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత మా భూములకు భద్రత కలిగింది. ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతుల బాధలు తీర్చిండు. ఇప్పుడు సర్వ హక్కులు మాకే ఉన్నాయి. నా వేలిముద్ర లేనిదే నా భూమిని ఎవరూ పొందలేరు. అట్లాంటి ధరణిని కాంగ్రెసోళ్లు తీసేస్తామంటున్నట్లు వినపడుతుంది. అదే జరిగితే మళ్లీ పాత కథే అయితది. పటేల్, పట్వారీ వ్యవస్థ మాకొద్దు.
మాది కామేపల్లి మండలం జోగ్గూడెం. కారేపల్లి మండల రెవెన్యూ పరిధిలో మాకు మూడెకరాల భూమి ఉంది. ఆ రోజుల్లో రేత్రిపూట తోటకు నీళ్లు కట్టేందుకు నేను, నా భర్త కలిసి చిన్న పిల్లల్ని ఇంటి వద్ద వదిలేసి పోయేది. అప్పుడు రాత్రిపూట కొద్దిసేపు మాత్రమే వ్యవసాయానికి కరెంటు వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పొద్దంతా సాగు పనులు చేసుకొని రాత్రంతా కుటుంబ సభ్యులంతా కలిసి ఉంటున్నాం. కుటుంబాలను దూరం చేసే కాంగ్రెస్ పాలన మాకు వద్దు. రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలి. రైతు కుటుంబాలను కడుపులో పెట్టుకొని చూసే కేసీఆరే మళ్లీ సీఎంగా మాకు కావాలి. కడుపులు కొట్టే కాంగ్రెసోళ్లు మాకొద్దు.
దొంగల రాజ్యం మళ్లా మాకొద్దు. ఒకప్పుడు గెట్ల తగాదాలతో తోడబుట్టిన బంధుత్వాలను దూరం చేసుకునే వాళ్లం. ఏటా పంట వేసే సమయంలో కాను గెట్ల పంచాయితీలు జరిగేవి. వ్యవసాయ పనులు పక్కన పెట్టి పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలకే సరిపోయేది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల ఎవరి భూములకు వాళ్లు హద్దులు కల్పించారు. అన్నదమ్ములు, పక్క భూముల వాళ్లతో గెట్ల తగాదాలు పోయాయి. ఉచిత విద్యుత్ మాకెంతగానో ఉపయోగపడుతుంది. కొంత భూమిలో రోజు చేతికి డబ్బులు వచ్చే పంట వేసుకొని ఆర్థికంగా బాగుపడుతున్నాం. మాకు మళ్లీ పాత రోజులు రావొద్దు. ఇట్లా ఉంటే సాలు ఎవ్వరి మాటలు వినం. సీఎం కేసీఆర్ సారే రైతు బాంధవుడు. మా మద్దతు కారు గుర్తుకే.
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోతే రైతులకు కష్టాలే మిగులుతాయి. ధరణితో వీఆర్వో నుంచి ఏ అధికారికి కూడా ఒక్క పైసా ఇవ్వకుండా పాస్‌బుక్ ఇంటికే వచ్చింది. అటువంటి ధరణిపై కాంగ్రెస్ చేసే ప్రచారంతో రైతులు నష్టపోతారు. ప్రస్తుతం ఒక రైతు నుంచి మరో రైతుకు భూమి ఎక్కాలంటే ఒక్కరోజులోనే పని పూర్తవుతుంది. పైసా ఖర్చు లేకుండా రైతుకు ఉపయోగపడే ధరణి కొనసాగాలంటే కాగుర్తుకే ఓటు వేయాలి.
మూడు గంటలు కరెంట్‌తో రైతులకు ఆత్మహత్యలే శరణ్యమవుతాయి. 24 గంటలు విద్యుత్‌తో రెండు పంటలు పండించుకుంటున్న రైతు ఆనందంతో ఉన్నాడు. 10 హెచ్‌పీ మోటర్లు, మూడు గంటలు కరెంట్ అంటున్న కాంగ్రెస్ మాటలతో ఓరిగేది ఏమీలేదు. రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి 24 గంటలు కరెంట్ ఇచ్చే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే నోర్లు తెరిచిన బీడు భూములే దర్శనమిస్తాయి. ఉచిత విద్యుత్‌తో 24 గంటలకు ఇచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే ఆశీర్వదించాలి.
సీఎం కేసీఆర్‌కు పల్లె ప్రజలు రుణపడి ఉంటారు. 2014కు ముందు చింతకానిలో ఉదయం 6 గంటలకు కరెంటు పోయి రాత్రి 7 గంటలకు వచ్చేది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఉక్కపోతతో గ్రామీణులు అల్లాడిపోయారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో కరెంటు కష్టాలు పోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు లేక రోళ్లతోనే పచ్చళ్లు తయారు చేయడంతో సమయం ఎక్కువగా అయ్యేది. కానీ.. బంగారు తెలంగాణలో పగటిపూట ఏ సమయంలోనైనా వంటలు వండుకుంటున్నాం. సీఎం కేసీఆర్ పాలనలో ఏ ఇబ్బందులూ లేవు.
కాంగ్రెసోళ్లు 10హెచ్‌పీ సామర్థ్యం గల మోటర్లతో 3 గంటల విద్యుత్ చాలంటున్నారు. కానీ.. 10హెచ్‌పీ మోటర్లు మావద్ద లేవు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ అందిస్తున్న 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాతో రైతాంగం మొత్తం సంతోషంగా ఉన్నాం. మాకు 3 గంటల కరెంట్‌తోపాటు 10హెచ్‌పీ మోటార్లు వాడే ఓపిక లేదు. సీఎం కేసీఆర్ అందిస్తున్న విద్యుత్‌తో ఇలానే ఎవుసం కొనసాగిస్తాం. 24 గంటలు కరెంట్ ఇస్తామనే ప్రభుత్వానికే యావత్ రైతాంగం మద్దతు ఉంటుంది. కాంగ్రెసోళ్ల మాటలకు, చేతలకు పొంతన లేదు.
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో లబ్ధి పొందడానికే రైతులను మభ్య పెడుతున్నారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకున్నది లేదు. ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప వ్యవసాయ రంగం కోసం ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. విత్తనాలు, ఎరువుల నుంచి పంటలు అమ్మడానికి రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. సీఎం కేసీఆర్ కారణంగా రైతులు సంతోషంగా బతుకుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న 24 గంటలు కరెంట్‌తో 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్ల కింద పంటలకు నీరందించుకుంటూ రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారు. 10 హెచ్‌పీ మోటర్ల వినియోగం సాధ్యం కాదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వ్యవసాయం గురించి తెలియదు.
సీఎం కేసీఆర్ సాథ్యంలో గృహిణులు, రైతాంగం, చిన్న, కుటీర, పెద్ద పరిశ్రమల నిర్వాహకుల కరెంటు కష్టాలు మాయమయ్యాయి. గృహాలకు, వ్యవసాయ కనెక్షన్లకు, పరిశ్రమలకు పవర్ హలిడేలను బంద్ చేయించి 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేయడంతో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకుల 3 గంటల కరెంట్, 10హెచ్‌పీ మోటర్ విధానాలను రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు.
నేను 20 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో రైతులందరూ ఒక్కసారిగా మోటర్ ఆన్ చేయడంతో ట్రాన్స్ఫార్మర్లు తరచుగా కాలిపోయేవి. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల నాణ్యమైన విద్యుత్‌తో వ్యవసాయం చేస్తున్నాం. తొమ్మిదేళ్ల నుంచి ఒక్కసారి కూడా మా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోలేదు. మా మండలంలో విద్యుత్ అధికారులు సైతం నిరంతరం రైతులకు అందుబాటు ఉంటారు. గతంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే పంట ఎండిపోయే దాకా పట్టించుకునే నాథుడే ఉండరు. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు.
మా సాగు భూముల్లోని బోర్లలో ఒకటిన్నర నుంచి రెండు ఇంచుల పరిధిలో నీరు మాత్రమే లభ్యమవుతుంది. వీటికి 3హెచ్‌పీ, 5హెచ్‌పీ మోటర్లే అతికష్టంగా నడుస్తున్నాయి. అలాంటిది.. 10హెచ్‌పీ మోటర్లు ఏర్పాటు చేయమనడం హాస్యాస్పదంగా ఉంది. మోటరు కొంటేనే రూ.లక్షకుపైగా అవుతుంది. ఇది కొనే సామర్థ్యం అందరు రైతులకు ఉండదు. ప్రస్తుతం తెలంగాణ సర్కారు అందిస్తున్న నిరంతర విద్యుత్‌తో వ్యవసాయం సజావుగా సాగుతున్నది. మళ్లీ ఇదే సర్కారు రావాలని, ఇలాంటి విధానాలే అమలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
గతంలో కరెంట్ ఎప్పుడు వస్తదో తెలియని పరిస్థితి. రైతులు పంట పొలాల వద్ద కరెంట్ షాక్‌లు, పాము కాటుకు ఎందరో చనిపోయిన సందర్భాలున్నాయి. కానీ.. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఉచితంగా 24 గంటలు ఇచ్చి రైతుబంధుతో పెట్టుబడికి ఎకరాకు రూ.10వేలు ఇచ్చి ఆదుకున్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచి పంటలకు మద్దతు ధర కల్పించారు. కాంగ్రెస్ వస్తే 50 ఏళ్లు వెనక్కు పోవాల్సిందే. రైతులకు మూడు గంటలు కరెంట్ ఇస్తే పంటలు ఎండిపోయి.. రాత్రివేళల్లో కరెంట్ పెట్టబోయి ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడాల్సిందే. రైతులు కాంగ్రెస్ పార్టీని రైతులు నమ్మరు. మళ్లీ కేసీఆర్ గెలిస్తేనే రైతులు బాగుపడతారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అరకొర విద్యుత్‌తో రైతులు నానా తంటాలు పడ్డారు. విద్యుత్ సరిగా అందకపోవడంతో మోటార్లన్నీ ఒక్కసారిగా స్వీచ్ వేయడంతో కొన్ని మోటర్లు కాలిపోయి రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యేవారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే పంటలు పండుతాయి లేకపోతే వదిలేద్దామనే పరిస్థితి ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తుండటంతో ఏ ఒక్క రైతు పొలం ఇంత వరకు ఎండిపోయిన దాఖలాలు లేవు. తెలంగాణ ప్రభుత్వంలోనే రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు.
10హెచ్‌పీ మోటర్ వాడకం అనేది ఖర్చుతో కూడుకున్నది. కాంగ్రెసోళ్లు రైతులను ఆగం చేయడానికే 10హెచ్‌పీ మోటర్లు పెట్టాలనే పూటకోమాట మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి 3హెచ్‌పీ, 5హెచ్‌పీ మోటర్లను వాడుతున్నారు. 10హెచ్‌పీ మోటర్‌కు రూ.లక్షలు ఖర్చయితయ్. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతులను పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అప్పుడే మర్చిపోతమా. మాకు ఇప్పుడున్న కరెంటే కావాలి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంక రైతులకు కరెంటు కష్టాలు లేకుండా చేసింది. మాకు ఇప్పుడున్న కరెంటు చాలు.
కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత పేరుతో కౌలుదారుల కాలాన్ని చేర్చితే రైతు నష్టపోయే ప్రమాదం ఉంది. ధరణి ద్వారానే వేలిముద్ర వేస్తే తప్ప ఒకరి భూమిని మరొకరికి బదలాయించే పరిస్థితి లేదు. అటువంటి ధరణిని ఎత్తివేస్తే గతంలో రెవెన్యూ వ్యవస్థలో జరిగిన లోపాలే మళ్లీమళ్లీ జరిగే ప్రమాదం ఉంది. అటువంటి ధరణిని కాపాడుకునేందుకు రైతులందరూ పోరాడి సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలి. కారు గుర్తుకే ఓటు వేయాలి.
ధరణితోనే రైతుల భూములకు రక్షణ ఉంది. గతంలో పొలాన్ని పట్టా పాస్‌బుక్ చేయించుకోవాలంటే అధిరానేలపే కలిసే పరిస్థితి ఉన్నప్పటికీ ఆ భూమికి పాస్‌బుక్ రావడం ఇబ్బందిగా ఉండేది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణితో భూములకు పాస్‌బుక్‌లు చేయించుకోవడం రూపాయి ఖర్చు లేకుండా సులభతరంగా మారింది. ప్రతి రైతు గుండెపై చెయ్యి వేసుకొని నిద్ర పోతున్నాడంటే అది ధరణి చలువే. పాస్‌బుక్ రావడంతోనే రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు వస్తున్నాయి.
సీఎం కేసీఆర్ వ్యవసాయానికి కరెంట్ మంచిగా ఇస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు మూడు గంటల కరెంట్ పంటల సాగుకు సరిపోదు. గత కాంగ్రెస్ పాలనలో ఇచ్చే కరెంటుతో ఎన్నోసార్లు మోటర్లు కాలిపోయేవి. రిపేర్ చేయించడానికి రైతులపై ఆర్థిక భారం పడేది. నీరందక పంటలు ఎండిపోయేవి. రైతులు తీవ్రంగా నష్టపోయిన సందర్భాలెన్నో. కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మొద్దు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌తో ఎంతో మేలు జరుగుతుంది. ఏ సమయంలోనైనా రైతులు మోటర్లు పెట్టుకుంటున్నారు. రైతులు ఆలోచించి రైతు ప్రభుత్వానికి అండగా నిలవాలి. కరెంట్ మూడు గంటలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలి.
తెలంగాణ రాక ముందు నీళ్లు కోసం వరి పంటలు ఎండిపోతాయోమోననే భయంతో విద్యుత్ మోటర్ల ద్వారా కాపలా ఉండేందుకు రెయింబవళ్లు కష్టపడ్డాం. పొలాలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లే క్రమంలో విషసర్పాలు కళ్లారా చూస్తూ భయాందోళనకు గురవుతూ బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో పొలాలకు సమృద్ధిగా నీటిని అందించగలుగుతున్నాం. కాంగ్రెస్ వాళ్లు చెప్పే మాటలు నమ్మి మోసపోకుండా బీఆర్ఎస్కు రైతులంతా తమ మద్దతు తెలపాలి.
సీఎం కేసీఆర్ మా కష్టాలను గుర్తించి ఇబ్బందులు లేకుండా చేశారు. 24 గంటలు కరెంట్‌తో పాటు రైతుబంధు, రైతు రుణమాఫీ చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు కేవలం 3 గంటల కరెంట్ సరిపోతుందని అనడం సిగ్గుచేటు. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే దాదాపు రూ. లక్ష ఖర్చు వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఓటు వేసి మళ్లీ కష్టాలు కొనితెచ్చుకోవద్దు.
దళారీ వ్యవస్థ కోసమే కాంగ్రెస్ భూమాత పథకాన్ని తెస్తామంటున్నది. కాంగ్రెస్ హయాంలో రైతుల భూములకు రక్షణ లేకుండా పోయింది. ఇష్టానుసారంగా రెవెన్యూ రికార్డులు మారినయ్. రికార్డుల్లో పేర్లు ఇష్టమొచ్చినట్లు ఎక్కించుకున్నరు. ధరణి వచ్చిన తర్వాత వాటన్నింటికీ చెక్ పడింది. ధరణిని ఎత్తేస్తే మళ్లీ మోసాలు ఎక్కువైతయ్. కౌలుదారులు, అనుభవదారులకు కొట్లాటలు మొదలవుతాయి. ధరణి వచ్చినంకనే సులువుగా రిజిస్ట్రేషన్లు అవుతున్నయి. ఇంత మంచి విధానాన్ని ఎత్తేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు పిచ్చి మాటలు మాట్లాడుతున్నరు. ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం.
సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తేవడం వల్ల నకిలీలకు అడ్డుకట్ట పడింది. అంగుళం జాగాను పక్క వాడు తీసుకోవాలన్నా పట్టాదారుని వేలిముద్రలు కావాలి. మా తాత, ముత్తాతలు చెబుతుండే వారు. పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడం వల్ల అంగబలం, అర్థబలం ఉన్న వాళ్లు మోసం చేసి భూములు లాక్కునేవారని. ధరణి పోర్టల్ అందుబాటులోకి రావడంతో వారి ఆటలకు తెర పడింది. సీఎం కేసీఆర్ ఆలోచనా తీరు వర్ణనాతీరం. వ్యవసాయ రంగానికి మేలుచేసే సీఎం కేసీఆర్ రైతు కుటుంబాల పాలిట దేవుడు. కొందరు రైతుల నడ్డి విరిచేందుకే ధరణి వ్యవస్థను రద్దు చేస్తామని విషం కక్కుతున్నారు. ప్రతి ఒక్కరూ వారి కపట నాటకాలను నమ్మకుండా తిప్పికొట్టాలి.
వ్యవసాయానికి 24 గంటల కరెంట్ లేనప్పుడు ఏడాదిలో ఒకే రైతు మోటర్లు 3, 4సార్లు కాలిపోయేది. ఆనాడు వారి అవస్థలు చూస్తుంటే బాధ వేసేది. పొద్దంతా మా షాపు వద్ద పడిగాపులు కాసి మోటర్లు రిపే ర్లు చేపించుకునేది. మాకు చేతినిండా పని ఉన్నప్పటికీ రైతుల కన్నీళ్లు చూసి బాధ అనిపించేది. కరెంటు ఇచ్చే కొద్ది సమయంలో ఏకకాలంలో వందలాది మోటర్లు ఆన్ చేయడం వల్ల కాలిపోయేది. ఇప్పుడు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేయడం వల్ల ఏడాదిలో ఒక్కసారి కూడా మోటర్లు రిపేర్‌కు రావడం లేదు. హై, ఓల్టేజ్ సమస్య లేదు. తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్ల సంఖ్యను పెంచింది. రైతులకు కరెంట్ కష్టాలు తొలగిపోయాయి.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల కరెంట్ రైతులకు ఊపిరిపోస్తుంది. ఆనాడు రాత్రిపూట నీళ్లు కట్టడానికి చేనుకు వెళ్తే పురుగుబూసి కుట్టకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేవాళ్లం. ఇప్పుడు అలాంటి భయం లేదు. మళ్లీ ఆ రోజులు వస్తే రైతు కుటుంబాలకు అంధకారమే. వచ్చీరాని కరెంట్‌తో మోటర్లు కాలిపోయేవి. పంటలు ఎండిపోయి పెట్టుబడులు కూడా రాక ఆర్థికంగా నష్టపోయేది. సరిగ్గా దిగుబడులు లేక అప్పులే మిగిలేవి. రైతుబంధు పెట్టుబడి సాయం, ఉచిత కరెంట్‌తో మా కష్టాలు తొలిగిపోయాయి. కాంగ్రెసోళ్లు చెబుతున్నట్లు మూడు గంటల కరెంట్ పది సాళ్లను తడపడానికి కూడా సరిపోదు. మాకు మాటలు చెప్పే నాయకులు వద్దు.. చేతలు చేసి చూపించే కేసీఆర్ లాంటి నాయకుడే కావాలి.