ఖమ్మం వ్యవసాయం, మే 31 : జిల్లాలో ఎక్కడ కూడా నకిలీ విత్తనాల విక్రయాలు చేపట్టకుండా గట్టి నిఘా పెట్టామని, ఇందుకోసం వ్యవసాయ, పోలీసు అధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. శుక్రవారం నగరంలోని బర్మాషెల్ రోడ్, గాంధీచౌక్‌లోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను కలెక్టర్ తనిఖీ చేశారు. దుకాణాల్లోని స్టాక్, అమ్మకం, రసీదులను పరిశీలించారు. కచ్చితంగా స్టాక్ బోర్డులో వివరాలు నమోదు చేయాలన్నారు. విత్తన ప్యాకెట్లు, క్యూ ఆర్ కోడ్లను పరిశీలించారు. ఏ పంట విత్తనాలు.. ఏ రకాలను రైతులు ఎక్కువగా అడుగుతున్నారని వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విత్తనాల కొనుగోలు కోసం వచ్చిన రైతులతో కలెక్టర్ మాట్లాడారు. పోయిన ఏడాది ఏ పంట వేశారు? ఈసారి ఏ పంట వేస్తున్నారు? అని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానకాలం సీజన్‌కు సంబంధించి అవసరమైన మేర విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, రసీదు తప్పక తీసుకోవాలన్నారు. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు అవసరమైన 4 లక్షల పత్తి ప్యాకెట్లకు గాను ఇప్పటికే 4.50 లక్షల ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇంకా లక్ష ప్యాకెట్లు తెప్పించేందుకు కార్యాచరణ చేశామన్నారు. పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, జీలుగు, పిల్లిపెసర విత్తనాలను 60 శాతం రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు. విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందొద్దని, అవసరానికి మించి అందుబాటులో ఉన్నాయని, ప్రశాంతంగా రైతులు కొనుగోలు చేయవచ్చన్నారు. కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసరావు, అర్బన్ మండల వ్యవసాయాధికారి కిశోర్‌బాబు తదితరులు ఉన్నారు.