ఖమ్మం అర్బన్, జూన్ 6 : గత సర్కారుకంటే భిన్నంగా విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులను అందిస్తామంటూ గత విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు ఆర్భాటపు ప్రకటనలు చేసిన కాంగ్రెస్ సర్కారు.. వాటిని అమలు చేయలేక బోల్తా పడింది. గత బీఆర్ఎస్ సర్కారు అనుసరించిన విధానాలకు భిన్నమైన విధానాలను అనుసరించాలన్న తలంపు తప్ప.. సరైన విధానాన్ని పాటించకపోవడంతో రేవంత్ ప్రభుత్వం పదేపదే బొక్కబొర్లా పడుతోంది. దీంతో విద్యార్థులకు సకాలంలో స్కూల్ యూనిఫాం అందడం లేదు.
కేవలం సర్కారు తప్పిదాల కారణంగా విద్యార్థుల ఏకరూప దుస్తులు బహుళ సమస్యలతో సతమతమవుతున్నాయి. క్లాత్ కోసం మిల్లర్లకు సకాలంలో ఆర్డర్లు ఇవ్వకపోవడం, క్లాత్‌ను విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూళ్ల వారీగా కాకుండా ఏకమొత్తంగా పెద్ద బండిల్‌తో జిల్లాకు చేర్చడం, మండలాలు, స్కూళ్ల వారీగా ఆ క్లాత్‌ను కట్ చేయాల్సి రావడం, యూనిఫాం స్టిచ్చింగ్ బాధ్యతను డీఆర్డీఏకు, ఎస్‌హెచ్‌జీలకు అప్పగించడం, స్టిచ్చింగ్ కోసం కొన్నిచోట్ల క్లాత్ ఆంధ్రాలోని జిల్లాలకూ వెళ్లడం,
వారు సకాలంలో కుట్టి పంపకపోవడం, అసలు క్లాత్ జాడే కన్పించడకుండా పోవడం, అప్పటికే కుట్టుకూలి బిల్లులు విడుదల కావడం, కానీ.. యూనిఫాం సదరు స్కూళ్లకు చేరకపోవడం, ఇంతలో విద్యాసంవత్సరం ముగిసిపోవడం వంటి సవాలక్ష సమస్యలు కాంగ్రెస్ సర్కారు తప్పిదం కారణంగా చోటుచేసుకున్నాయి. దీంతో చాలా స్కూళ్లలో నిరుడు విద్యార్థులకు రెండో దుస్తులు అందలేదు. ఈ ఏడాది మేల్కొన్నట్లుగా మరికొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఏకరూప దుస్తులు విద్యార్థులకు సకాలంలో చేరే అవకాశం మృగ్యంగానే కన్పిస్తుండడం గమనార్హం.
2024-25 విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు అందించాలన్న కాంగ్రెస్ సర్కారు లక్ష్యం.. తన స్వయంకృతాపరాధంతో నీరుగారిపోయింది. ఆ విద్యాసంవత్సరం ముగిసినా, 2025-26 విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఇప్పటికీ నిరుటి రెండో జత ఏకరూప దుస్తులను విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందించలేదు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గ కేంద్రంలోని కొన్ని పాఠశాలల్లోనూ నిరుటి రెండో జత అందకపోవడం ఏకరూప దుస్తుల పంపిణీలో సర్కారు నిర్లక్ష్యానికి దర్పణంగా నిలుస్తోంది. విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకునేది. తనిఖీ చేసి మరీ నాణ్యమైన వస్ర్తాన్ని ఎంపిక చేసేవారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగిన క్లాత్‌ను ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి స్కూలు వివరాలు, విద్యార్థుల సంఖ్య వంటి లేబుళ్లతో నేరుగా మండల కేంద్రాలకు చేర్చేవారు. అక్కడి నుంచి ఆ క్లాత్ పాఠశాలలకు చేరేది. పాఠశాల విద్యాకమిటీ బాధ్యులు, ప్రధానోపాధ్యాయులు కలిసి స్థానికంగా తమకు అందుబాటులో ఉన్న టైలర్లను ఎంపిక చేసి వారి ద్వారా సకాలంలో ఏకరూప దుస్తులు కుట్టించేవారు. పాఠశాలల ప్రారంభం నాటికే దుస్తులు సిద్ధంగా ఉండేవి. ఒకవేళ ఒకటీ రెండు రోజులు ఆలస్యమైనా సదరు టైలర్ల దగ్గరకు వెళ్లి పర్యవేక్షించడానికి అవకాశం ఉండేది.
కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టిచ్చింగ్ బాధ్యతను డీఆర్డీఏకు, ఎస్‌హెచ్‌జీలకు అప్పగించడం, కొన్నిచోట్ల వారు ఆ క్లాత్‌ను ఏకంగా ఆంధ్రాలోని కృష్ణా, గుంటూరు జిల్లాలకు తీసుకెళ్లి కుట్టించడం, కొన్నిచోట్ల నుంచి ఆ క్లాత్ తిరిగి రాకపోవడం, కానీ.. బిల్లులు విడుదల కావడం వంటి తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా విద్యాసంవత్సరం ముగిసిపోయినా, కొత్త విద్యాసంవత్సరం మొదలైనా విద్యార్థులకు రెండో జత ఏకరూప దుస్తులు అందే అవకాశం లేకుండా పోయింది.
రాష్ట్రంలో ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. నిరుడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరింత నాణ్యమైన ఏకదూప దుస్తులు సకాలంలో అందిస్తామంటూ బీరాలు పలికింది. ఆచరణలో విఫలం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విస్తుపోతున్నారు. ఏకరూప దుస్తుల తయారీ, కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు సకాలంలో ఆర్డర్ ఇవ్వలేదు. దీంతో వస్త్రం రావడంతో తీవ్రం జాప్యం జరిగింది. గత ప్రభుత్వం అనుసరించిన విధానంలా స్కూళ్ల వారీ ప్యాకింగ్లుగా కాకుండా పెద్దపెద్ద బండిళ్ల రూపంలో వస్ర్తాన్ని జిల్లా కేంద్రాలకు పంపింది.
ఈ వస్ర్తాన్ని మండలాల వారీగా కట్ చేసి చిన్నచిన్న బండిళ్లను వేరుచేసే బాధ్యతను హ్యాండ్లూమ్ అధికారులకు అప్పగించింది. ఇంతటి గజిబిజి వ్యవహారాన్ని పర్యవేక్షించడం సమగ్రశిక్ష కోఆర్డినేటర్లయిన జిల్లాల సీఎంవోలకు తలపోటుగా మారింది. అయినప్పటికీ టైలర్లను ఏర్పాటు చేసి వస్ర్తాన్ని కట్ చేసి మండలాలకు సరఫరా చేశారు. అప్పటికే పాఠశాలలు ప్రారంభమై నాలుగైదు నెలలు కావడం, అప్పుడొచ్చిన వస్ర్తాన్ని కట్ చేసే అవకాశం లేకపోవడంతో హడావిడిగా నేరుగా డీఆర్డీఏ ఎస్‌హెచ్‌జీలకు ఇచ్చారు. ఆ ఎస్‌హెచ్‌జీల్లో సరైన శిక్షణ లేని టైలర్లు ఉండడం, వారు నెమ్మదిగా కుట్టడం, పైగా వేరే జిల్లాలకు అప్పగించడం వంటి చర్యలతో స్టిచ్చింగ్ అస్తవ్యస్తమైంది.
నిరుడు స్వీయ నిర్లక్ష్యంతో చేతులు కాల్చుకున్న కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు రావడంతో ఈ ఏడాది ముందుగానే పాఠశాలల వారీగా క్లాత్ ప్యాకెట్లను తయారు చేసి పంపిణీ చేసింది. ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో దానికి ముందుగా నిర్వహించే బడిబాట కార్యక్రమం నాటికి విద్యార్థులకు అందించేందుకు రెండు జతల ఏకరూప దుస్తులను సిద్ధం చేశామంటూ ప్రకటించుకంది.
కానీ.. రెండు నెలల క్రితం ఖమ్మం జిల్లాకు కేవలం ఒక జత దుస్తులకు సంబంధించిన వస్త్రం మాత్రమే వచ్చింది. ఈ రెండు నెలలు పూర్తయినా ఆ ఒక జత దుస్తులు కూడా ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. ఇక రెండో జత దుస్తుల కోసం వస్త్రం పంపిణీని ఈ నెల 2న ప్రారంభించారు. మంగళవారం నుంచి మండల కేంద్రాల నుంచి పాఠశాలలకు చేరవేస్తున్నారు. ఇక ఈ రెండో జత కుట్టేదెప్పుడో, పంపిణీ చేసేదెప్పుడో, విద్యార్థులు ధరించేదెప్పుడో చూడాలి.
2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన యూనిఫాం పంపిణీలో చాలాచోట్ల గోల్మాల్ జరిగింది. కొన్ని మండలాల్లోని కొన్ని పాఠశాలలకు అందని యూనిఫాం ఏమైందనే అంశంపై విద్యాశాఖ వద్ద సమాధానం లేదు. వస్త్రం టైలర్ల దగ్గరకు వెళ్లిందా? వెళ్లితే కుట్టారా? కుడితే విద్యార్థులకు ఎందుకు చేరలేదు? అనే అంశాలపై విద్యాశాఖ నుంచి ఎవరూ పర్యవేక్షణ చేయలేదు.
దీనిపై కొందరు హెచ్ఎంలు గత డీఈవోకి అధికారికంగా ఫిర్యాదులు కూడా చేశారు. ఇటీవల ఖమ్మం ఐడీవోసీలో జరిగిన హెచ్ఎంల సమీక్షలోనూ పలువురు హెచ్ఎంలు ఈ విషయాన్ని అదనపు కలెక్టర్ శ్రీజ దృష్టికి తీసుకెళ్లారు. మరి దీనిపై విచారణ జరిపిస్తారో లేదో చూడాలి.