భద్రాచలం, నవంబర్ 26: విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని, సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని టెస్సా రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ దామల్ల సత్యం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈర్ల ప్రసాద్‌లు డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణంలో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్(టీఎస్ఎస్ఏ) విద్యార్థి మహాగర్జన బుధవారం నిర్వహించారు. తొలుత డిగ్రీ కళాశాల నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీగా వచ్చిన సంఘ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందుకు ర్యాలీకి అనుమతి లేదని, ర్యాలీ నిలిపివేయాలని కోరారు.
దీంతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ర్యాలీని విరమించిన అనంతరం సంఘ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు అరకొరగా విడుదల చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే పూర్తిస్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, వాటిలో సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. నూతన భవనాలు సకల సౌకర్యాలతో నిర్మించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కూరెళ్ల మహేశ్‌కుమార్, బుయ్యన వీరబాబు, కూరెళ్ల ఉదయ్‌కుమార్, నిర్మాల సతీశ్, కే.వీరేందర్, డి.శేఖర్, రాంచందర్, అఖిల్, పావని తదితరులు పాల్గొన్నారు.