శేరిలింగంపల్లి సర్కిల్ కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్రకాలనీ హైటెన్షన్ లైన్ రోడ్డులో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, హైడ్రా అధికారులు ప్రతాపం చూపించారు. ముందస్తు సమాచారమివ్వకుండా దుకాణాలను కూల్చివేయడంతో తమ జీవితాలను రోడ్డు పాలు చేశారంటూ బాధితులు నిరసన తెలిపారు. రోడ్డు పక్కన సాగుతున్న చిరువ్యాపారాలతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని, దుకాణాలను తొలగించాలని మాకు ముందస్తు సమాచారమిస్తే, స్వచ్ఛందంగా తొలగించుకునే వారిమని, ఇలా జేసీబీలతో కూల్చివేస్తే తమ కుటుంబాలు ఏమవ్వాలంటూ బోరుమన్నారు. షాపుల్లో పనులు చేసుకుంటుండగానే జేసీబీలతో కూలగొట్టారని, ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మానవత్వం లేకుండా అధికారులు వ్యవహరించారంటూ మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గచ్చిబౌలి పోలీసులు కలుగజేసుకుని వెంటనే వారిని అక్కడి నుంచి పంపించివేశారు.
– కొండాపూర్, ఫిబ్రవరి 21