కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఆగస్టు 13 : లంబాడీల వ్యతిరేకి సీతక్కను మంత్రి పదవి నుండి తొలగించాలని ఎల్ హెచ్ పి ఎస్ నాయకుడు రమేశ్ నాయక్ డిమాండ్ చేశారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి సీతక్క ఆస్తులపై కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సమగ్ర విచారణ చేపట్టాలని, మేడారం సమ్మక్క సారక్క జాతర నిధుల అక్రమాలపై విచారణ జరిపి నిధుల వినియోగం పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లంబాడీల ఆత్మగౌరాన్ని, మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదన్నారు.
సుప్రీంకోర్టులో లంబాడీలపై కేసు వేసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అశ్వరావుపేట జారే ఆదినారాయణపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో బంజారాల ప్రతిఘటన కాంగ్రెస్ పార్టీకి తప్పదన్నారు. ఈ నెల 9న ఆదివాసి దినోత్సవం సంస్కృతిక సభ పేరుతో కొత్తగూడెం ప్రకాశం మైదానంలో జరిగిన సభలో లంబాడీలను అణగదొక్కాలని విషం కక్కుతూ సీతక్క మాట్లాడడం కారణం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు భూక్య మంగీలాల్ నాయక్, నరేష్ నాయక్, సక్రు నాయక్, గుగులోత్ రమేష్ నాయక్ పాల్గొన్నారు.