Ramayanam | అమ్మ పుట్టిన పదిహేడు రోజులకే అమ్మమ్మ చనిపోవడంతో.. తాత, మేనమామ వద్ద బమ్మెరలో పెరిగింది. అమ్మ మేనమామకు ఒక కూతురు, ఏడుగురు కొడుకులు ఉన్నా.. అమ్మను కూడా ఎంతో ప్రేమగా పెంచారట. అందుకని వాళ్లను తోడబుట్టిన వాళ్లలానే అమ్మ చూసేది.
వాళ్లందరిలో పెద్దాయన హైదరాబాదులో కొన్నిరోజులు, బమ్మెరలో కొన్నిరోజులు ఉండేవాడు. చివరి ఇద్దరూ హైదరాబాదులోనే ఉండేవారు. అయితే, నాకు ఏడేళ్ల వయసులో అనుకుంటా.. మిగిలిన వాళ్లలో మూడు కుటుంబాల వాళ్లు మా ఊరికి తరలి వచ్చారు. వాళ్లకు ఏవో బెదిరింపు లేఖలు వచ్చాయనీ, అందులో ఊర్లో కొందరి ప్రమేయం ఉందనీ, మొదట్లో తేలిగ్గా తీసుకున్నా.. ‘కొడతాం, చంపుతాం’ అన్న వార్తలు వచ్చేసరికి, అన్నదమ్ములంతా ఊరు వదిలి తలో దారిపట్టారనీ పెద్దవాళ్లు అనుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్లకే ఆ లేఖలు వీళ్లకు కాదనీ, తప్పుగా వీళ్లను టార్గెట్ చేశారనీ తెలిసిందట. ఏదేమైనా వాళ్లు ఊరు వదిలిపోవడానికి ఆ లేఖలు కారణమయ్యాయట.
అమ్మకు మేనమామ పిల్లలంటే సొంత అన్నదమ్ముల్లాగానే కనుక.. వాళ్లను బాగా అభిమానించేది. నాన్న ఆదరణ, సహకారం వల్ల వాళ్లలో ఒకాయన మా ఊర్లో ఇల్లు కట్టుకుంటే, మిగతా ఇద్దరూ ఇళ్లు కొనుక్కున్నారు. వాళ్ల పిల్లలతో మా అనుబంధం అలానే కొనసాగింది. సొంత ఊరిలో అంత పెద్ద గడీని, మందీ మార్బలాన్నీ వదిలి.. ఇక్కడ చిన్న ఇళ్లల్లో ఉన్నారని అమ్మ బాగా బాధపడేది. వీలైనంత వరకు వాళ్లకు ఏదో రకంగా సహాయపడాలనే చూస్తుండేది.
అందులో వాసు చిన్నాయన భలే అందంగా ఉండేవాడు. తెల్లటి పైజమా, కలర్ లాల్చీ, కూలింగ్ గ్లాసెస్, జుట్టుకు బిల్ క్రీమ్తో ఎప్పుడూ తళతళలాడుతూ కనిపించేవాడు. అందరితో కలుపుగోలుగా నవ్వుతూ ఉండేవాడు. అమ్మ ఆయన్ని.. ‘వాసూ, వాసయ్యా’ అని పిలిచేది. ఆయనో చిన్నసైజు డాక్టరు. ఎవరైనా కాస్త మలబద్ధకంతో ఉన్నారంటే.. “ఏమున్నది! ఓ ‘డెల్కోలాక్స్’ ఏస్కుంటే అయిపాయే” అనేవాడు. ఎవరికైనా విరేచనాలు అవుతుంటే, ఇంట్లో పెద్దవాళ్లు మెంతులు, పెరుగు తినమంటుంటే.. “ఎహె గవన్ని గాదు! ఒక్క ‘అండియాల్’ ఏస్కుంటే దెబ్బకు సీల్ పడ్తది” అనేవాడు. జలుబు చేసి బాధపడుతుంటే.. “మూడ్రోజులు కోల్డరిన్ ఎయ్యండి. అదే పోతది” అని సలహా ఇచ్చేవాడు. అజీర్ణంగా ఉంటే.. ‘డైజిన్’, తలనొప్పి అంటే ‘యాస్పిరిన్’, కడుపు నొప్పి లేస్తే ‘జెలూసిల్’.. ఇట్లా రానురానూ అందరికీ వైద్య సలహాలిచ్చి మందుల్ని సూచించేవాడు. మందుల పేర్లు, వాటి ఉపయోగాలే కాదు.. గ్లాక్సో, రాన్బాక్సీ, సిప్లా వంటి ఏ కంపెనీ ఏ ట్యాబ్లెట్ను తయారు చేస్తుందో కూడా చెబుతుండేవాడు. మొత్తానికి ఆయన నోట్లోంచి ఎప్పుడు చూసినా ఏవో మందుల పేర్లు వస్తూనే ఉండేవి.
చాలా విచిత్రమైన సంగతి ఏమిటంటే.. ఆయన మంత్ర వైద్యుడు కూడా. నాకు అబ్బురమనిపించిన విషయం అది. ఓరోజు మేము పొద్దున్నే బడికి వెళ్తూ వాళ్లింటి ముందు రాగక్క కోసం ఆగాము. అప్పుడే అక్కడికి మంచం మీద ఓ యువకుణ్ని పడుకోబెట్టి నలుగురు మోస్తూ హడావుడిగా పరిగెత్తుతున్నట్టుగా తీసుకొచ్చారు. ఆ గుంపులో ఎవరో.. “జర్ర దొరను పిలువుండయ్యా! బిన్న పిలువుండి, పోరనికి పాము కుట్టింది” అని ఆత్రుత పడుతూ అన్నాడు. ఒక్క నిమిషంలోనే వాసు చిన్నాయన బయటికి వచ్చాడు. ఆ సమయంలో పైన షర్ట్ కూడా వేసుకుని లేడాయన.
“ఎక్కడ కుట్టింది?” అడిగాడు.
“మడికట్ల కాడ గడ్డి కోస్తాంటె గెట్టు మీదికెల్లి జప్పున కాలు అందుకున్నదట పురుగు!” ఎవరో జవాబిచ్చాడు. చిన్నాయన వెంటనే తన ఒంటికి ఉన్న లుంగీ చివరన పర్రున చింపి.. ఆ యువకుడి కాలి పిక్కకు పాము కాటుకు కొద్దిగా పైన గట్టిగా కట్టాడు. ఇంటి ముందే ఉన్న వేపచెట్టు కొస కొమ్మలను వంచి లేత చిగుర్లను తెంపి అతన్ని నమలమన్నాడు. ఇంట్లోకి వెళ్లి మరేదో తెచ్చి నోట్లో పోసాడు. ఇదంతా చేస్తూ చిన్నాయన ఏదో చదువుతూనే ఉన్నాడు. అది చూస్తూ మేము కాసేపు అలానే ఉండిపోయాము. ఇక స్కూలుకు ఆలస్యం అవుతుందని వెళ్లిపోయాం.
“రాగక్కా! చిన్నాయన ఆ పాము కుట్టినాయినకు ఏం చేస్తడు?” అడిగాను. హాస్పిటల్కు కాకుండా ఇక్కడికెందుకు వచ్చారో అనుకుంటూ. “నానకు పాము మంత్రం వచ్చు. ఎందర్నో బతికించిండు. ఎక్కడెక్కడి నుంచో ఒస్తరు” అంది రాగక్క. “మరి ఒచ్చే లోపల్నే ఏమన్న అయితెట్ల?” నా అనుమానం. “ఎమ్మో మరి!”.. రాగక్క సమాధానం. నా డౌట్ తీరక అమ్మను అడిగాను. “అవును! శానామంది వాసు దగ్గరికి ఒస్తరు. మంత్రం మహిమ ఉంటదో ఏమో! బాగయి పోతున్నరు మరి!” అమ్మ సమాధానం కూడా నాకు సంతృప్తినివ్వలేదు కానీ, ఊరుకున్నాను.
చాలా ఏళ్ల తరువాత ఎక్కడో చదివాను. పాములన్నీ విషపూరితమైనవి కావనీ, పాము కుట్టగానే చచ్చిపోరనీ, కొన్నిసార్లు పాము కుట్టిందనే భయంతోనే గుండె ఆగి చచ్చి పోతారనీ. బహుశా మంత్రం సంగతేమో గానీ, వాసు చిన్నాయన వాళ్లకు బతుకుతారనే భరోసా ఇచ్చి, ఆ తరువాత వేపాకు, మరొకటి ఇచ్చి వైద్యం చేసేవాడనుకుంటా. వాళ్ల దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకునేవాడు కాదు చిన్నాయన, పైగా ఆయన ఒంటి మీద ఆ సమయంలో ఉన్న తువ్వాళ్లు, లుంగీలు చినిగిపోయేవి కూడా. తరువాత కొన్నేళ్లకు వాళ్ల కుటుంబం నల్గొండకు షిఫ్ట్ అయ్యాక కూడా.. “పాము మంత్రం ఏసే దొరోళ్లు లేరా?” అని అడిగిపోతూ ఉండేవారు. ఊర్లో చాలామంది ఇప్పటికీ గుర్తుచేస్తారు కూడా.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి