రేపటి భావిభారత పౌరులకు విద్యానిలయాలుగా ఉండాల్సిన గురుకులాలు సమస్యల వలయాలుగా మారాయి. చదువు సంగతి దేవుడెరుగు.. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అధికారులు చిన్నారులతో ఏకంగా వెట్టిచాకిరి చేయిస్తూ వారి విద్యా భవితవ్యాన్ని నాశనం చేస్తున్నారు.
వసతిగృహాల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రత, భోజనంలో నాణ్యత లేకుండాపోయింది. ప్రహరీలు, సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోవడంతో నిత్యం విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. పాఠశాల ఆవరణంలోనే పిచ్చిమొక్కలు పెరుగుతుండడంతో పాములు, పురుగులకు భయపడిపోతున్నారు. కిటికీలు సరిగ్గా లేకపోవడంతో వర్షాకాలం గదుల్లోకి నీరు వస్తున్నది. దీంతో నిద్రపోకుండా రాత్రంతా జాగారం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో సమస్యలు తాండవం చేస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
– ఖమ్మం, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో గురుకులాల సంఖ్యను పెంచి పటిష్టం చేసింది. విద్యారంగానికి పెద్దపీట వేసిన నాటి సీఎం కేసీఆర్.. విద్యార్థుల సంక్షేమం కోసం కోట్ల రూపాయలను వెచ్చించారు. గురుకుల విద్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు సకల సౌకర్యాలను కల్పించారు. విద్యార్థులకు పౌష్టికాహారంతోపాటు నాణ్యమైన విద్యను అందించింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను పట్టించుకున్న పాపానపోలేదు.
ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని గురుకులాలన్నీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పేద విద్యార్థులు చదువుకునే గురుకులాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధ తక్కువైంది. సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ సర్కారు.. ఆ సమస్యలు బయటకు పొక్కకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే ముందుగానే నో ఎంట్రీ అంటూ చెప్పించేస్తున్నారు. లేదంటే దబాయించేసి మాట్లాడుతున్నారు. అపరిశుభ్రత, భోజనంలో నాణ్యత లేకుండాపోయింది. గతంలో 9 గంటలకు పెట్టిన స్కూళ్లు.. ఇప్పుడు ఉదయం 8గంటలకే కుదించడంతో సరిపడా బాత్రూంలు లేక విద్యార్థులు సమయానికి తరగతి గదుల్లోకి వెళ్లలేకపోతున్నారు.
జిల్లాలోని ప్రతి గురుకులాల్లో సరైన సౌకర్యాలు లేవు. ప్రహరీలు, సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోవడంతో నిత్యం విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. పాఠశాల ఆవరణంలోనే పిచ్చిమొక్కలు పెరుగుతుండడంతో పాములు, పురుగులకు విద్యార్థులు భయపడిపోతున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలెంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయంలో విద్యార్థులు సవాలక్ష సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. బాత్రూంలు సరిపడా లేకపోవడంతోపాటు అపరిశుభ్రంగా ఉండడంతో ఆరుబయటే విద్యార్థులు స్నానం చేస్తున్నారు.
గురుకులానికి కోతల సమస్య తీవ్రంగానే ఉంది. హాస్టల్ నిర్వాహకుల పర్యవేక్షణలేమి కారణంగా రెండురోజులక్రితం కోతులు స్వైరవిహారం చేసి నీళ్ల హౌస్‌ల్లో జలకాలాడాయి. ఆ నీటితోనే విద్యార్థులు స్నానాలు చేయడంతో విద్యార్థులకు అలర్జీ వచ్చి పలువురు జ్వరం బారినపడ్డారు. జ్వరంతో ముగ్గురు విద్యార్థులు ఇంటిబాట పట్టారు. కిటికీలు సరిగ్గా లేకపోవడంతో వర్షాకాలం గదుల్లోకి నీళ్లు వచ్చి విద్యార్థులు ఉండలేని పరిస్థితి.
వర్షం వస్తే కిటికీల గుండా నీళ్లు రాకుండా విద్యార్థులు టవళ్లు, పట్టాలు పెట్టి కాపాడుకోవాల్సిన దుస్థితి. ఇక ఇక్కడ భోజనం మెనూ పాటించడం లేదు. నిత్యం వట్టి అన్నం నీళ్ల చారే దిక్కు. అదే పరమాన్నంగా విద్యార్థులకు జీరా రైస్ అంటూ నామకరణం చేసి వడ్డించేస్తున్నారు. ఉన్న గదుల్లో సరిపడా ఫ్యాన్లు లేవు.. బల్లాలు లేక విద్యార్థులు నేలపైనే కూర్చుని పాఠాలు వింటున్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో బీసీ గురుకులాలు మొత్తం 24 ఉండగా వాటిల్లో 6,400 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటిలో రెండింటికి మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి.
మిగిలిన 22 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 22 గురుకులాల్లో స్కూలు, జూనియర్ కాలేజీలు నడుస్తుండగా 2 డిగ్రీ గురుకుల కళాశాలలు ఉన్నాయి. ఇక ఎస్సీ గురుకులాలు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా 23 ఉన్నాయి. మొత్తం 11వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీటిలో 13 సొంత భవనాల్లో, 10 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. 21 ఎస్సీ గురుకులాల్లో స్కూల్ కమ్ జూనియర్ కళాశాలలు, రెండు గురుకుల డిగ్రీ కాలేజీలుగా ఉన్నాయి.
అశ్వారావుపేట పట్టణంలోని రింగ్‌రోడ్డు సమీపంలో ఉన్న ముస్లిం మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి మాట్లాడుకునేందుకు కనీసం స్థలం కూడా లేదు. పాఠశాల సమీపంలోని చెట్ల కింద, రోడ్డుమీదనే నిల్చొని మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఇక తరగతి గదులు సైతం విశాలంగా లేవు.. ఆటస్థలాలు లేక విద్యార్థులు మగ్గిపోతున్నారు. పట్టణంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో సైతం సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మైనార్టీ గురుకులం మినహా బీసీ బాలుర, బాలికల గురుకులాలు ప్రైవేటు భవనాల్లోనే ప్రభుత్వం నిర్వహిస్తున్నది.
బూర్గంపహాడ్‌లోని ఎస్సీ బాలుర వసతిగృహం ఆవరణ, భవనంపై కొందరు విద్యార్థులు శుభ్రం చేస్తూ శనివారం ‘నమస్తే’ కంటపడ్డారు. ఆ దృశ్యాలను కెమెరాలో చిత్రీకరించి అక్కడే ఉన్న వాచ్మెన్ అన్వేష్‌ను ఇదేమిటని ప్రశ్నించగా స్వచ్ఛభారత్ అంటూ తమ వసతిగృహాన్ని తామే శుభ్రం చేసుకుంటున్నామని గొప్పగా చెప్పడం గమనార్హం. హాస్టల్ వార్డెన్ ప్రసాద్‌ను ఫోన్లో వివరణ కోరగా నేను ఇక్కడ బాధ్యతలు చేపట్టి మూడు రోజులైందని, వసతిగృహం ఆవరణ బాగోలేకపోవడంతో దోమలు వ్యాప్తి చెందుతాయని పిల్లలతో ఇలా చేయించాల్సి వచ్చిందని… మరెప్పుడూ పిల్లలతో పనులు చేయించమని చెప్పడం కొసమెరుపు.
బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, బాలికల జూనియర్ కళాశాల అస్తవ్యస్తంగా మారింది. గురుకుల కళాశాల ఆవరణలో గేటు సమీపంలో ఒకపక్క చెత్తాచెదారం.. మరోపక్క పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. భవనం కిటికీలకు తలుపులు లేవు.. కళాశాల ఆవరణలో మురుగునీరు నిలిచి ఉంది. ‘నమస్తే’ విలేకరి’ శనివారం విజిట్ చేసేందుకు వెళ్లగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాజేశ్వరి నిరాకరించారు. ఏదైనా మాట్లాడాలని అనుకుంటే కళాశాల విద్యార్థులను ఆఫీస్రూమ్కు పిలిపిస్తాం… మీరు ఏమి అడగాలన్నా ఇక్కడే అడగండి… అంటూ దురుసుగా సమాధానమిచ్చారు.
రఘునాథపాలెం బీసీ గురుకుల పాఠశాలలో సమస్యలు తిష్ట వేశాయి. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ప్రిన్సిపాల్‌కు అనేకమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. బాత్రూంలు అపరిశుభ్రంగా ఉన్నాయి. కోతుల బెడద విపరీతంగా ఉంది. క్యాంటీన్లోకి వచ్చి మరీ పెంట పెడుతున్నాయి. విద్యార్థులు ఆ హౌస్‌లోని నీళ్లతోనే స్నానాలు చేస్తున్నారు. వర్షం వస్తే హాస్టల్ గదుల్లోకి నీరు వస్తున్నది. కిటికీలకు రాడ్లు, తలుపులు లేకపోవడంతో జల్లు కురిసి నీరు చేరుతున్నది. వర్షం వస్తే రాత్రంతా విద్యార్థులు జాగారం చేయాల్సి వస్తోంది.
– వీ వెంకటేశ్, పీడీఎస్‌యూ, ఖమ్మం జిల్లా కార్యదర్శి