ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 17: కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన విద్యార్థులు ఖమ్మంలోని యూనివర్సిటీ పీజీ కళాశాల ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 30 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించకుండా ప్రభుత్వం అక్రమంగా తెచ్చిన జీవో 21ని వ్యతిరేకిస్తున్నామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ.. సమాజాభివృద్ధిలో కీలకంగా మారిన విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకులను శాశ్వత ప్రాతిపదికన క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
అలాగే పార్ట్‌టైం కాంట్రాక్ట్‌గా అప్డేట్ చేయాలని డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ జిల్లా నాయకులు మందా సురేశ్, మస్తాన్లు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించేవరకు కాంట్రాక్ట్ అధ్యాపకులకు విద్యార్థులతోపాటు తాము మద్దతుగా నిలిచి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా జీవో 21ని వెనక్కి తీసుకోవాలని, ఏళ్లతరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు రవికుమార్, శ్యాంబాబు, కోటి, మధు, శ్రీనివాస్, రాజీవ్, లక్ష్మీహరిత, రమ, విద్యార్థి సంఘాల నాయకులు వెంకటేశ్, సురేశ్, సమైఖ్య, ఠాగూర్, విద్యార్థులు పాల్గ్గొన్నారు.