ఖమ్మం సిటీ, జూన్ 20 : ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. పెండింగ్‌లో ఉన్న నాలుగునెలల వేతనాలు చెల్లించాలని శుక్రవారం 259 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనబాట పట్టారు. కాంగ్రెస్ సర్కారు తీరుపై కడుపుమండి సీఐటీయూ, టీయూసీఐ కార్మిక సంఘాల మద్దతుతో దవాఖాన ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఇటీవలే దాదాపు వారంరోజులపాటు ధర్నాలు చేసిన అనంతరం హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయం ముట్టించగా ఇరవై నాలుగు గంటల్లో రెండు నెలల వేతనాలు చెల్లిస్తామనే హామీని గుర్తుచేశారు.
పదిరోజులు గడిచినప్పటికీ నయా పైసా డబ్బులు కార్మికుల ఖాతాల్లో జమకాలేదని, ఇచ్చిన మాట ఏమయ్యిందని ప్రశ్నించారు. కార్మికుల్లో అనేకమంది భర్తలు కోల్పోయిన వారే ఉన్నారని, కడుపున పుట్టిన బిడ్డలకు కనీసం పిడికెడు అన్నం కూడా పెట్టలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు ఇంటి అద్దెలు చెల్లించని కారణంగా యజమానులు వారిని ఇండ్లు ఖాళీ చేయిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యపు ధోరణి కారణంగా ఆకలి చావులను చూసే పరిస్థితులు దాపురించాయని వ్యాఖ్యానించారు.
జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని, సర్కారు దవాఖానలో పనిచేస్తున్న నిరుపేద కార్మికులను పట్టించుకున్న పాపానపోవడం లేదని ధ్వజమెత్తారు. కార్మికుల సమ్మెకు జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళనను అంచెలంచెలుగా ఉధృతం చేస్తామని, శనివారం అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం, సోమవారం అన్ని పార్టీలు, సంఘాల మద్దతుతో ప్రభుత్వాసుపత్రిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గండమాల రామయ్య, కొయ్యల శ్రీనివాస్, ఉపేందర్, అంబేద్కర్, మాతంగి అనిల్‌కుమార్, కే జగదీష్, ఏ అశోక్, ఎం సైదులు, కే వెంకటేశ్వర్లు, పీ వెంకటరమణ, విజయమ్మ పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై స్థానిక వైద్యాధికారులు చేతులెత్తేశారు. కార్మికులు విధులు నిర్వహిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ వారి వేతనాలకు సంబందించిన నిధులు ప్రభుత్వమే విడుదల చేయాల్సి ఉందని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ కిరణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. పైనుంచి డబ్బులు వస్తేనే మేము ఇస్తామని నిర్మొహమాటంగా చెబుతున్నారు. రోగులకు ఇబ్బందులు కలుగకుండా నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి 20 నుంచి 30 మంది కార్మికులను రప్పించి పారిశుధ్య పనులు చేయిస్తున్నామని స్పష్టం చేశారు.
జిల్లా కేంద్రంలోని అతి పెద్ద సర్కారు దవాఖానలో 259 మంది కార్మికులు నిరాటంకంగా విధులు నిర్వహిస్తేనే అనేక రకాల సమస్యలు ఉత్పన్నమయ్యేవి. అలాంటిది కేవలం 20 నుంచి 30 మంది కేఎంసీ కార్మికులు పనులు చేస్తుంటే రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రధానంగా మాతా, శిశు సంరక్షణ విభాగంలో ప్రసవాలు జరుగుతుంటాయి. ఆయా వార్డుల్లో, బాత్రూముల్లో ఎప్పటికప్పుడు శుభ్రంగా లేకపోవడంతో గర్భిణులు, బాలింతలు, అప్పుడే పుట్టిన చిన్నారులు ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం లేకపోలేదని పలువురు వైద్యులే అంటున్నరు. జనరల్ ఆసుపత్రిలోని అన్నిరకాల వార్డుల్లో తూతూమంత్రపు పనుల కారణంగా రోగులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఇప్పటికైనా సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే దవాఖాన ప్రతిష్ట మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం అవుతున్నది.