కారేపల్లి, డిసెంబర్ 16 : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి మండలంలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం సందర్శించారు. ముందుగా కారేపల్లిలో గల పోలింగ్ కేంద్రంలో బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రతి ఒక్కరు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బందికి అభ్యర్థులు, స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు సహకారం అందించాలన్నారు. సెక్షన్ 163 BNSS యాక్ట్ అమల్లో ఉన్నందున ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. నిబంధన అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.