సత్తుపల్లి రూరల్, జూలై 25 : సోమవారం సాయంత్రం నుంచి వర్షం పడుతుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పొలాల్లో నీరు చేరడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. బేతుపల్లి చెరువుకు పెద్ద ఎత్తున వరదవచ్చి చేరడంతో అలుగు ఉధృతంగా ప్రవహిస్తూ తమ్మిలేరు ద్వారా ఆంధ్రాకు చేరుతుంది. వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో రైతులు నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. వర్షం కారణంగా సింగరేణిలోని జేవీఆర్ ఓసీలో 1.80లక్షల క్యూబిక్ మీటర్ల మట్టితొలగింపు, 30వేల టన్నుల బొగ్గు వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. కిష్టారం ఓసీలో 45వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు, 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
తల్లాడ, జూలై 25: మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కుర్నవల్లి వద్ద వాగు, ఏరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పినపాక వద్ద గంగిదేవిపాడు, మిట్టపల్లి వద్ద ఏరుకు భారీగా వరదనీరు చేరింది. కొత్తవెంకటగిరి వద్ద బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహించింది. పొలాలు నీటితో నిండాయి.
కొణిజర్ల, జూలై 25: మంగళవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురిసింది.పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, తీగలబంజర సమీపంలోని పగిడేరు, అంజనాపురం సమీపంలోని పెద్దఏరు ఉధృతంగా ప్రవహించాయి. వీటితో పాటు నిమ్మవాగు ఉధృతంగా ప్రవహించగా, మండలంలోని పలు చెరువులకు నీటి ప్రవాహం పెరిగింది.
కామేపల్లి, జూలై 25 : ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరద నీరు కామేపల్లి పెద్ద చెరువులోకి చేరడంతో చెరువు మత్తడి పోస్తున్నది. పొన్నేకల్ బుగ్గవాగు, ముచ్చర్ల నిమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రైతులు పొలాలను దమ్ము చేసే పనిలో నిమగ్నమయ్యారు. మండలంలో 75.8 మి.మీ. వర్షపాతం నమోదైందని తహసీల్దార్ కోట రవికుమార్ తెలిపారు.
వైరాటౌన్, జూలై 25 : వైరా రిజర్వాయర్ నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 17.9 అడుగులకు చేరుకున్నది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు నిండుకుండలా మారింది. వైరా ఆయకట్టు పరిధిలో వరి, పత్తి, చెరకు, మిర్చి పంటలను రైతులు సాగు చేస్తున్నారు.