కారేపల్లి, సెప్టెంబర్ 2: ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలంలో వీధి కుక్కల (Stray Dogs) బెడద తీవ్రంగా ఉంది. కుక్కల సంచారం వల్ల ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వీధుల్లో ఎక్కడపడితే అక్కడ ఉండే కుక్కలు దారిన పోయే వారిపై దాడి చేసి కరుస్తున్నాయి. వాహనాలపై వెళ్లే వారిని కూడా వెంబడించి కరుస్తున్నాయి. పంచాయతీల్లో ఫిర్యాదు చేస్తున్నా ఫలితం ఉండటంలేదు. గ్రామాల్లో సాధారణంగా పారిశుధ్య సమస్య అధికంగా ఉంటున్నది. దానికంటే కుక్కల బెడదే ఎక్కువగా ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలకు వెళ్లే పిల్లలు, రోడ్లపై నడిచి వెళ్లే మహిళలు, వృద్ధులు మరింత బెంబేలెత్తుతున్నారు.
Dogs 1
వాహనాలపై ప్రయాణించే వారిని కుక్కలు గుంపులుగా వెంబడిస్తున్నాయి. కుక్కల సమస్యపై గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని అంటున్నారు. మండల వ్యాప్తంగా కుక్కకాటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సింగరేణి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జూలై నెలలో 100, ఆగస్టు నెలలో 94 కుక్క కాటు కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి బీ.సురేష్ తెలిపారు. ఈ విషయమై స్థానిక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ జి.ఇందిరా దృష్టికి తీసుకురాగా కుక్కల నిర్మూలనకు చట్టం అనుమతించదని, ప్రమాదం లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని, కుక్కలకు వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు.