భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అర్హులైన వారు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్.. అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, సంబంధిత అధికారులతో సంక్షేమ పథకాల అమలు, పీఎం కుసుమ్ పథకం, వేసవిలో నీటి కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలు, ప్లాంటేషన్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను గురువారం ఉదయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. చర్ల 23, దుమ్ముగూడెం 23, అశ్వాపురం 3, మణుగూరు 7, బూర్గంపాడులో ఒక దరఖాస్తు ఆన్లైన్ చేయాల్సి ఉందని, వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో కొత్తగా వచ్చిన 3,403 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఉపాధిహామీలో 20 రోజుల పని దినాల కంటే ఎక్కువ ఉన్న వారిని గుర్తించాలన్నారు. వీటిని ఈ నెల 31వ తేదీలోపు పరిశీలించి నివేదిక అందించాలన్నారు.
కొత్త రేషన్ కార్డు దరఖాస్తులను ఆన్లైన్ చేయడం ద్వారా అర్హులకు డిజిటల్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వేసవిలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. హరితహారంలో ఇప్ప, ముష్టి, తంగేడు, మునగ, సుబాబుల్, సిస్సు, టకోమో, మందారం తదితర మొక్కలను నాటడం ద్వారా గిరిజనులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డీపీవో చంద్రమౌళి, పీడీ హౌసింగ్ శంకర్, జీఎం ఇండస్ట్రీస్ తిరుపతయ్య, ఎల్డీఎం రామిరెడ్డి, డీఈవో వెంకటేశ్వరాచారి, సెర్ప్ పీడీ నీలేష్, అదనపు డీఆర్డీవో రవి తదితరులు పాల్గొన్నారు.