ఖమ్మం, జనవరి 4: ప్రభుత్వ పథకాల కోసం ప్రజలెవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పథకాలన్నీ ప్రతి ఇంటికీ వస్తాయని, ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూర్చుతాయని అన్నారు. అభయహస్తం కార్యక్రమం కింద అమలు చేసే ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం గ్యారెంటీ హామీలన్నింటినీ అమలుచేస్తుందని స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలో గురువారం పర్యటించిన ఆయన.. 49వ డివిజన్లో నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం కార్యక్రమం కింద ఐదు గ్యారెంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు.
గత నెల 28న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 6 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ, అన్ని మున్సిపల్ వార్డుల్లోనూ నిర్ణీత తేదీల్లో కొనసాగుతుందని అన్నారు. అయితే ప్రజాపాలన గ్రామసభ రోజున దరఖాస్తు అందించలేని ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ నెల 6లోపు ఆయా దరఖాస్తులను తమ గ్రామ పంచాయతీ కార్యాలయాలు, మున్సిపల్ వార్డు కార్యాలయాల్లో అధికారులకు అందజేయాలని సూచించారు. అయితే తాము చెప్పిన ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే అమలుచేశామని గుర్తుచేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచామని గుర్తుచేశారు. ఈ సందర్భంగా దరఖాస్తు సమర్పించేందుకు సభకు వచ్చిన ప్రజలతో ఆయన మాట్లాడారు. ఎవరెవరు ఏయే పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో అడిగి తెలుసుకున్నారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఏసీపీ హరికృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.