నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 2 : నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వంద కోట్ల నిధులతో అభివృద్ధి జరిగింది. సంక్షేమ పథకాలు పేద, మధ్య తరగతి ప్రజలకు అందాయి. కానీ.. మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మల్ మున్సిపాల్టిలోని 42 వార్డులకు ఒక్క రూపాయి పనులు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం, రోడ్లు, డ్రెయినేజీలు శుభ్రపర్చడానికే పాలన సరిపోతున్నదని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా.. నిర్మల్ పట్టణాభివృద్ధికి టీయూఎఫ్ఐడీసీ, ఎస్డీఎఫ్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. 42 వార్డులకు గాను కేవలం ఎనిమిది వార్డుల్లోనే పనులు పూర్తవ్వగా.. మిగతా వార్డుల్లో రూ.80 కోట్ల పనులను నాయకులు ఆపేశారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అభివృద్ధి పనులు చేయకపోవడంపై పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసంపూర్తిగా అభివృద్ధి పనులు
బీఆర్ఎస్ ప్రభుత్వ నిధులతో పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. అసంపూర్తిగా వదిలేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. క్రీడా మైదానాల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లను పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి. పార్కులను పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలు మొలిచాయి. మినీ ట్యాంక్ బండ్ పను లు ఆగిపోయాయి. బోటింగ్ పనులు పూర్తి కాలేదు. మంచిర్యాల చౌరస్తా వద్ద రూ.కోటితో నిర్మిస్తున్న శ్మశాన వాటిక పనులు పూర్తి చేయలేదు. సిద్ధాపూర్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూంలకు తాగునీటి సౌకర్యం కల్పించకపోవడం, సీసీ రోడ్లు నిర్మించకపోవడం, వీటిని పంపిణీ చేయకపోవడంతో వందల ఇండ్లు నిరూపయోగంగా ఉ న్నాయి. పాత తాసీల్ కార్యాలయం వద్ద రూ.10 కోట్ల తో సమీకృత మార్కెట్ నిర్మించేందుకు నిధులు విడుదల కాగా పాలకులు మొరంతో చదును చేసి వదిలేశారు. ఆర్టీ సీ బస్టాండ్‌లో నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. స్థానిక శ్యాంగఢ్‌ను లక్ష ల రూపాయలతో సుందరీకరణ చేయగా.. ఇప్పుడు ప ట్టించుకోకపోవడంతో వెలవెలబోతున్నది. నిర్మల్ పట్టణంలోని సెంట్రల్ లైటింగ్ మధ్య ఏర్పాటు చేసిన ఫౌం టేన్లు కళావిహీనంగా మారాయి. సెంట్రల్ లైటింగ్‌కు మ రమ్మతులు చేయకపోవడంతో రోడ్లన్నీ అంధకారంలో మగ్గుతున్నాయి. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో అవస్థలు తప్ప అభివృద్ధిని చూడలేదని ప్రజలు పేర్కొంటున్నారు.