హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ మోసం నిరుద్యోగ యువత రగిలిపోతున్నది. ఇచ్చిన హామీలు అమలు చేయని మోసంపై మండిపడుతున్నది. జాబ్ క్యాలెండర్ ఎక్కడ? ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఏవి? నెలనెలా నిరుద్యోగ భృతి ఎందుకివ్వరు? అని ప్రశ్నిస్తున్నది. గత రెండేండ్లుగా విడతల వారీగా ఆందోళనలు చేపడుతూ వస్తున్న నిరుద్యోగులు మహాధర్నాకు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద నిరుద్యోగ కవాతుకు సిద్ధమయ్యారు.
నిరుద్యోగులను ఉసిగొల్పి ఎన్నికల్లో వాడుకొని.. తీరా గద్దెనెక్కాక అదే నిరుద్యోగులను మోసం చేసిందని వారు భగ్గుమంటున్నారు. రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అంటూ మోసపుచ్చిన వైనంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. నిరుద్యోగుల సత్తాను చూపేందుకు ఈ నిరుద్యోగ కవాతును పిలుపునిచ్చినట్టు నిరుద్యోగ జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. వేలాది మందితో ఇందిరాపార్క్‌లో కదం తొక్కుతామని తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ కవాతులో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికలకు ముందు నిరుద్యోగ జేఏసీ నేతలను కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకున్నది. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బస్సుయాత్రను చేయించింది. తీరా అధికారంలో వచ్చాక నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించింది. పైగా ప్రశ్నించిన నిరుద్యోగులపై లాఠీలు, పోలీసులను ప్రయోగిస్తున్నది. తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది. ఇటీవల చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో సభలు, సమావేశాలనే రద్దుచేశారు. ‘అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలివ్వలేం’ అంటూ సర్కారు ఏకంగా శాసనమండలిలోనే ప్రకటించింది.
తాము రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీనివ్వలేదని సర్కార్ పెద్దలు వరుసగా వింత భాష్యాలు వల్లె వేస్తున్నారు. తాము వరుసగా నోటిఫికేషన్లు జారీచేస్తే ‘ఇన్నీ ఒకేసారి ఇస్తే ఎట్లా ప్రిపేర్ కావాలి. నోటిఫికేషన్లు రద్దు చేయాలని, వాయిదా వేయాలని నిరుద్యోగులు పోరాడుతున్నారు’ అంటూ కొందరు పెద్దలు అబద్ధాలను నిస్సిగ్గుగా చెప్పుకోవడం గమనార్హం. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు ఇతర ప్రక్రియను పూర్తిచేయగా, ఒక్క నియామక ప్రక్రియను చేపట్టిన కాంగ్రెస్ సర్కార్.. తామే ఆ ఉద్యోగాలిచ్చామంటూ చెప్పుకోవడంపై నిరుద్యోగులే సహించలేక పోతున్నారు.
ఏటేటా కాదు.. ఏకంగా మా టర్మ్‌లోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని మరో సర్కార్ పెద్ద చెప్పుకోవడంపై మండిపడుతున్నారు. ఇలా రోజుకో తీరు.. పూటకో మాటతో సర్కార్ పెద్దలు నిరుద్యోగులను దగా చేస్తున్నారు. మొత్తంగా సర్కార్ తీరుపై తీవ్రంగా రగిలిపోతున్న నిరుద్యోగులు 15 రోజుల క్రితం అశోక్‌నగర్‌లో, చిక్కడపల్లిలో పెద్ద ఎత్తున ఉద్యమించారు. దీనికి కొనసాగింపుగా నిరుద్యోగ కవాతును తలపెట్టినట్టు నిరుద్యోగ జేఏసీ నేతలు వెల్లడించారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా కవాతును నిర్వహించి తీరుతామని జేఏసీ నేతలు ప్రకటించారు.
నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై ఎన్నేండ్లు కాలయాపన చేస్తారంటూ ఓ నిరుద్యోగి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్‌ను నిలదీశారు. ఎన్నాళ్లీ సాగదీత? అంటూ ప్రశ్నించారు. గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయి? ఉద్యోగాలను ఎప్పుడు భర్తీచేస్తారు? అంటూ ఓ నిరుద్యోగి సోషల్ మీడియా వేదికగా ఆయనను ప్రశ్నించారు. ‘సూన్’ అంటూ ఆయన బదులిచ్చారు. దీంతో ఆగ్రహించిన నిరుద్యోగి.. ‘కాంగ్రెస్ పాలనకు రెండేండ్లు గడిచింది. ఇంకా సాగదీస్తే మీపై నిరుద్యోగులు పెట్టుకున్న నమ్మకం పోతుంది. ఇప్పటికే నమ్మకం కోల్పోయారు. పోగొట్టుకున్న నమ్మకాన్ని మీరు తిరిగి పొందలేరు’ అంటూ బదులిచ్చారు. మీరు మళ్లీ అధికారంలోకి రావొద్దని కోరుకుంటే ఇలాగే టైమ్‌పాస్ చేయండి. దాని ఫలితం ఎన్నికల్లో మీకే తెలుస్తుంది.. అంటూ సదరు నిరుద్యోగి ఘాటుగా హెచ్చరించారు.