ఖమ్మం రూరల్, జూలై 29: గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన మిషన్ భగీరథ పథకం ప్రజల్లో విశేష ఆదరణ చూరగొన్నది. జలాశయాల నుంచి పంపుహౌస్‌ల ద్వారా సేకరించిన నీటిని శుద్ధిచేసి గ్రామాలకు తరలించడం, అక్కడి నుంచి ఇంటింటికీ స్వచ్ఛమైన జలాలను సరఫరా చేయడం వంటి ప్రక్రియ గత కేసీఆర్ ప్రభుత్వంలో నిరాటంకంగా కొనసాగింది.
ఈ ప్రక్రియలో కాంట్రాక్టు విధానంలో అనేక మంది పంపు ఆపరేటర్లకు ఉపాధి కల్పించింది. గత కేసీఆర్ ప్రభుత్వం క్రమం తప్పకుండా కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించడం, వారు వాటిని పంపు ఆపరేటర్లకు వేతనాలుగా అందించడం వంటి ప్రక్రియ సాఫీగా సాగేది. కానీ.. ఎనిమిది నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. కాంట్రాక్టర్లకు సక్రమంగా బిల్లులు చెల్లించడం లేదు. దీంతో వారు పంపు ఆపరేటర్లకు వేతనాలు సకాలంలో ఇవ్వడం లేదు. దాని ప్రభావం ఆయా గ్రామాల ప్రజల మీద పడుతోంది.
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం చిన్నతండాలోని ఓహెచ్‌బీఆర్ పరిధిలోని 21 మంది యువకులు కాంట్రాక్టు పద్ధతిలో మిషన్ భగీరథ పంపు ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. రిజర్వాయర్ ద్వారా కేంద్రానికి వచ్చిన నీటిని శుద్ధి చేసి వాటిని గ్రామాల్లోని వాటర్ ట్యాంకులకు పంపిస్తున్నారు. గ్రామాల్లో గేట్ వాల్వులను ఆపరేట్ చేసి ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు. ఇందుకు గాను సంబంధిత కాంట్రాక్టర్ వీరిలో ఒక్కొక్కరికీ నెలకు రూ.13,500 చొప్పున వేతనం అందిస్తారు. ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలనూ కల్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో గడిచిన నాలుగు నెలలుగా వీరికి వేతనాలు చెల్లించడం లేదు.
మూడు నెలలుగా మొరపెట్టుకుంటున్నా కనీస స్పందన లేదు. కాంట్రాక్టర్‌ను అడిగితే రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నాడు. పీఎఫ్, ఈఎస్‌ఐల వాయిదాలను కూడా ఆయా ఖాతాల్లో జమ చేయడం లేదు. దీంతో విసిగివేసారిన పంపు ఆపరేటర్లు ఆదివారం నుంచి విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను వెళ్లదీస్తున్న తమకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతి నెలా జీతం అందితేనే భార్యాపిల్లలను పోషించుకోవడం కష్టంగా ఉంటున్న తమలాంటి చిరు వేతనదారులకు నెలల తరబడి జీతాలను ఇవ్వకుండా ఎలా జీవించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ ఉన్న నాలుగు నెలలకుగాను ఒక నెల వేతనాన్ని రెండు మూడు రోజుల్లో చెల్లించేలా చూస్తామంటూ మిషన్ భగీరథ అధికారులు అంటుండడం తమకు మరింత వేదనకు గురిచేస్తోందని ఆవేదన చెందుతున్నారు. తమకు వేతనాలు అందే వరకూ విధులు బహిష్కరిస్తామని స్పష్టం చేస్తున్నారు.
కాగా, ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలకు ఆదివారం సాయంత్రం నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే సుదూర ప్రాంతాలకు వెళ్లి వాటర్ ప్లాంట్ల వద్ద తాగునీటిని కొనుగోలు చేసుకొని తెచ్చుకుంటున్నారు. వర్షాలు కురుస్తున్న ఈ సమయంలో అలా తెచ్చుకోలేని వారి ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి.