ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 21: ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించాలని, యువతకు ఆటలపై ఆసక్తి కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం ఊరూరా క్రీడా ప్రాంగణాలతోపాటు వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసింది. ఆటలకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, వాటి చుట్టూ ఫెన్సింగ్ నిర్మించింది. వివిధ క్రీడాంశాలకు సంబంధించిన వస్తువులు, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేసింది.
ఆయా క్రీడా ప్రాంగణాల్లో విద్యార్థులు, యువకులు నిత్యం క్రీడా సాధన చేస్తుండగా.. సీనియర్ సిటిజన్లు వాకింగ్ ట్రాక్‌ను సద్వినియోగం చేసుకునేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో ఆలనా పాలన లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. కబ్జాలకు గురవుతున్నాయి. తెల్దారుపల్లిలో ఏర్పాటు చేసి వైకుంఠధామం షెడ్లను సైతం గుర్తు తెలియని ఎత్తుకెళ్లినా పట్టించుకునేవారు కరువయ్యారు. పెద్దతండా పరిధిలోని క్రీడా ప్రాంగణంలో నర్సరీ నిర్వహిస్తున్నారంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తీర్థాల పంచాయతీలో గత కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణంలో ఏకంగా మిర్చి తోటను సాగు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. నెలలు గడిచినా కనీసం పంచాయతీ కార్యదర్శి అటువైపు చూశాడా? చూసినా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాడా? అనేది తెలియాల్సి ఉంది. అయితే మిర్చి సాగు చేసిన భూమి దేవాదాయ శాఖ పరిధిలోనిది అని తెలుస్తుంది.
అయితే అప్పటి అధికారులు ప్రభుత్వ భూములను మాత్రమే పంచాయతీలకు బదలాయింపు చేసి లక్షలాది రూపాయల వ్యయంతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదరు భూమిలో మిర్చి తోట చేపట్టారు. అయితే ఆ భూమిని అధికారులు ఎవరికైనా లీజుకు ఇచ్చారా? లేదా మరెవరైనా తమకు అనుకూలంగా సాగు చేసుకుంటున్నారా? అనే విషయాన్ని ఉన్నతాధికారులే తేల్చాల్సి ఉంది. మండలంలోని ఇతర క్రీడా ప్రాంగణాలు సైతం కబ్జాలకు గురికావడం, ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నా అధికారులు అటువైపు చూడకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.