రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ పాఠశాలలను బలోపేతం చేసింది.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నది.. విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం కలిగించేందుకు, శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు క్రీడలకూ ప్రాధాన్యమిస్తున్నది. ప్రతి పాఠశాలకు క్రీడా‘నిధి’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.. దీనిలో భాగంగా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 1,428 ప్రభుత్వ పాఠశాలలకు రెండు విడతల్లో రూ.6.65 కోట్లు మంజూరు చేసి ఎస్‌ఎంసీల ఖాతాల్లో జమ చేసింది. ఈ సొమ్ముతో యాజమాన్యాలు క్రీడా సామగ్రిని విద్యార్థులకు అందుబాటులో ఉంచాల్సి ఉన్నది. ఒక విద్యాసంవత్సరంలో ప్రాథమిక పాఠశాలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10 వేల చొప్పున సొమ్ము అందనున్నది.
– అశ్వారావుపేట, జనవరి 9
అశ్వారావుపేట, జనవరి 9: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెంచేందుకు ప్రాధాన్యమిస్తోంది. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు క్రీడా నిధిని ఏర్పాటు చేసింది. ఇందుకు ఈ ఏడాదికి అవసరమైన నిధులను విడుదల చేసింది. క్రీడానిధి విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంపుతోపాటు మానసిక వికాసానికి దోహదపడనున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,428 ప్రభుత్వ పాఠశాలలకు రెండు విడతల్లో రూ.6,65,50,000 క్రీడానిధిని మంజూరు చేసింది. ఈ నగదును నేరుగా ఆయా పాఠశాలల యాజమాన్య కమిటీల (ఎస్ఎంసీ) ఖాతాల్లో జమ చేసింది. ప్రాథమిక పాఠశాలకు రూ.5 వేలు, ప్రాథమికొన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10 వేలు చొప్పున క్రీడానిధిని కేటాయించింది. ఇక నుంచి విద్యార్థులకు క్రీడా సామగ్రి అందుబాటులోకి రానుంది. సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు విద్యను విస్మరించాయి. ఫలితంగా విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేకపోగా నాణ్యమైన విద్య కూడా దూరమైంది.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలు, రైతులతోపాటు విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తోంది. ప్రత్యేక నిధులను కేటాయిస్తూ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటునిస్తోంది. 2022-23 విద్యా సంవత్సరానికి ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తూ కార్పొరేట్‌కు ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తోంది. ఇదే క్రమంలో విద్యార్థులు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సాహానిస్తోంది. క్రీడల ద్వారా విద్యార్థుల్లో మనోైస్థెర్యం, శారీరక, మానసిక దృఢత్వం అందించేందుకు కృషి చేస్తోంది. ఇందుకోసం క్రీడానిధిని ఏర్పాటు చేసి కావాల్సిన క్రీడా సామగ్రి కోసం నిధులు విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 1,428 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా వాటికి రూ.6.65 కోట్ల నిధులను కేటాయించింది. ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10 వేల చొప్పున క్రీడానిధిని మంజూరు చేసింది. ఈ నిధితో విద్యార్థులకు క్రీడా సామగ్రి అందుబాటులోకి రానుంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
క్రీడానిధికి ప్రత్యేక నిధులు..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం క్రీడానిధిని ఏర్పాటు చేసింది. క్రీడా సామాగ్రిని విద్యార్థులకు అందించేలా క్రీడానిధికి ప్రత్యేక నిధులు విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా ఎస్ఎంసీ చైర్మన్ల ఖాతాల్లో జమ చేసింది. క్రీడానిధి ద్వారా మంజూరైన నిధులతో ఎస్ఎంసీ చైర్మన్లు క్రీడా సామాగ్రిని కొనుగోలు చేసి విద్యార్థులకు అందిస్తారు. ఆసక్తి గల క్రీడల్లో విద్యార్థులు నైపుణ్యం పెంచుకొని రాణించేందుకు క్రీడానిధి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని వ్యాయామ ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు.
క్రీడా సామగ్రి ఇదే..
సర్కారు బడుల్లో విద్యార్థులను క్రీడల్లో రాణించే విధంగా వాలీబాల్, ఫుట్‌బాల్, క్రికెట్, బాస్కెట్ బాల్, త్రోబాల్, స్కిప్పింగ్ రోప్స్, షాట్‌పుట్, టెన్ని తదితర క్రీడా సామాగ్రిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి రోజూ చదువే కాకుండా క్రీడల్లోనే ప్రోత్సాహించడం ద్వారా విద్యార్థులు మరింత చురుగ్గా ఉండేందుకు ఉపయుక్తంగా ఉంటుందని వ్యాయామ ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
క్రీడా నైపుణ్యాల పెంపునకు దోహదం..
చదువే కాకుండా క్రీడల్లోనూ విద్యార్థులు తమ నైపుణ్యం పెంపొందించుకునేందుకు ఈ క్రీడానిధి దోహదపడుతోంది. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సాహించడం వల్ల వారిలో మనోైస్థెర్యం, మానసిక, శారీరక దృఢత్వం పెంపొందుతాయి. క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోగలరు. క్రీడల కోసం ప్రభుత్వంకృషి చేస్తుండడం హర్షణీయం.
-దివిలి ప్రసాద్, ఎస్ఎంసీ చైర్మన్, అశ్వారావుపేట
ప్రతిభగల క్రీడాకారులు వెలుగులోకి వస్తారు..
క్రీడల్లోనూ ప్రతిభ చూపిస్తున్న విద్యార్థులను వెలుగులోకి తెచ్చేందుకు ఈ ప్రయత్నం ఓ వేదిక కానున్నది. క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని ప్రభుత్వం క్రీడానిధి ద్వారా నిధులను కేటాయించడం సంతోషకరం. ఎప్పుడూ చదువే కాకుండా ఉపశమనం కోసం క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించడం మంచి ఆలోచన. ఈ వేదిక ద్వారా విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను మేమూ గుర్తించలగుతాం. విద్యార్థులు కూడా శారీరకంగా, మానసికంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారు.
-మల్లేశ్వరరావు, పీఈటీ, నారాయణపురం స్కూల్