కొత్తగూడెం క్రైం, జనవరి 25 : పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, అసాంఘిక శక్తులపై గట్టి నిఘా పెట్టాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. నూతనంగా నిర్మించిన చుంచుపల్లి మండల పోలీస్‌స్టేషన్‌ను గురువారం సందర్శించిన ఆయన తాత్కాలికంగా కొత్త భవనంలో ప్రారంభమైన సేవలను పరిశీలించారు. స్టేషన్‌లోని ఏర్పాట్లు, అక్కడికి వచ్చే ఫిర్యాదుదారులకు ఉండాల్సిన సౌకర్యాల విషయంలో లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు.
ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌లో 5ఎస్ విధానం కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఎస్పీ వెంట కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్, చుంచుపల్లి సీఐ పెద్దన్న కుమార్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎం.కరుణాకర్, ఎస్సై ప్రవీణ్‌కుమార్, పోలీస్ పీఆర్వో దాములూరి శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.