కారేపల్లి, మార్చి 25 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై 16వ విడుత సామాజిక తనిఖీ ప్రజా వేదికను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్డీఓ ఏపీడీ చుంచు శ్రీనివాసరావు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు మండలంలోని 41 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన వివిధ పనులపై నివేదికలను డీఆర్పీలు చదివి వినిపించారు. మండలంలో మొత్తం రూ.7,45,39,985 కోట్లు ఖర్చు చేయగా కూలీలకు రూ.7.08,53,153 సామగ్రికీ రూ.36,86,832 చెల్లింపులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఈ పనులపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించగా ఉపాధి హామీ సిబ్బంది పని ప్రదేశంలో కూలీల మస్టర్లపై సంబంధిత అధికారులు రోల్ కాల్ చేయకపోవడం, కొలతల్లో తేడాలు, మస్టర్లలో కూలీల సంతకాలు, హాజరు లేకుండా వేతనాల చెల్లింపులు, మస్టర్ల హాజరు గణన లెక్కింపులో తప్పిదాలు, పని ప్రదేశం తేడాలు, అర్హతలేని వారికి పని కల్పించి మస్టర్లు వేసి వేతనాలు చెల్లించడం, పని ప్రదేశాల్లో టెంట్లు, కూలీలకు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా ఖర్చులు రాయడం వంటి తప్పిదాలు వెలుగు చూశాయి. దీంతో పలు గ్రామ పంచాయతీల్లో రికవరీకి ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడి శ్రీదేవి, డీవీఓ సక్రియ, క్వాలిటీ కంట్రోల్ డీఈ వీరయ్య, ఎంపీడీఓ సురేందర్, ఎంపీఓ రవీందర్ ప్రసాద్, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ బానోత్ కోటేశ్వరరావు పాల్గొన్నారు.