ఇల్లెందు, సెప్టెంబర్ 24: సింగరేణి కాంట్రాక్టు కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం దగా చేసిందని, అతి తక్కువ బోనస్ ఇవ్వడం సరికాదంటూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సింగరేణి ఏరియా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.మధు, నాయకుడు యాకూబ్ షావలి మాట్లాడుతూ సింగరేణి సంస్థలో లాభాలకు కారణమైన కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 బోనస్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. లాభాల బోనస్‌లో వాటా, వేతనాల పెంపుదల, ఈఎస్ఐ వంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రామ్‌సింగ్, అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ, మల్లెల వెంకటేశ్వర్లు, పాయం వెంకన్న, రఘు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.