కారేపల్లి, అక్టోబర్ 8 : పోలింగ్ నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర చాలా కీలకమైనదని సింగరేణి మండల ఎంపీడీవో పి శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి)మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల సమావేశ మందిరంలో బుధవారం జరిగిన జడ్పిటిసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల విధులలో పాల్గొనే ప్రిసైడింగ్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. పోలింగ్ రోజు పీవో,ఏపీవోలు చేపట్టాల్సిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, శిక్షణలో ప్రతి అంశాన్ని పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు ఇచ్చే ఫారాలు, నివేదికలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి ప్రతీ విషయంలో చాలా జాగ్రత్త వహించాలని ఆయన తెలిపారు. మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ రోజు జాగ్రత్తగా సరిచూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఏ. రమేష్, ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్, మాస్టర్ ట్రైని రాజేష్ తదితరులు పాల్గొన్నారు.