కొత్తగూడెం సింగరేణి, మే 29: కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సింగరేణి ఆసుపత్రుల్లోనే పూర్తిస్థాయి వైద్యం అందించాలని, చిన్న జబ్బులకే హైదరాబాద్‌కు రిఫర్ చేయడం సరైన విధానం కాదని సింగరేణి సీఎండీ బలరాం వైద్యాధికారులకు సూచించారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల ఆస్పత్రుల ప్రధాన వైద్యాధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏరియా ఆస్పత్రుల యాజమాన్యాలు తక్షణమే వారికి కావాల్సిన కనీస వైద్య పరికరాలు, అవసరమైన మందుల ప్రతిపాదనలు పంపించాలని, తన తదుపరి తనిఖీల్లో ఏ ఒక్క పరికరం లేదనే మాట రాకూడదని హెచ్చరించారు. ఇప్పటికే ఏరియా ఆస్పత్రులకు వైద్యులను పూర్తిస్థాయిలో కేటాయించామని, ఇంకా అవసరమైన వైద్యులు, టెక్నీషియన్లను సమకూర్చేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉందన్నారు. చిన్న జబ్బులకే హైదరాబాద్ ఆసుపత్రులకు రిఫర్ చేయడం ద్వారా మూడేళ్లలో రూ.30 కోట్లు ఉన్న రిఫరల్ బిల్లులు ఇప్పుడు రూ.వంద కోట్లకు చేరాయన్నారు.
గతంలో వైద్య సేవలకు నిధుల మంజూరులో అనేక ఆటంకాలు ఉండేవని, ఇప్పుడు ఎటువంటి కోతలు, తగ్గింపులు లేకుండా నిధులు మంజూరు చేయడానికి యాజమాన్యం సిద్ధంగా ఉన్నారు. కొవిడ్ వ్యాప్తి చెందిన క్రమంలో దానిని ఎదుర్కొనేందుకు అన్ని ఏరియా ఆసుపత్రుల్లో తగిన విధంగా సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు సత్యనారాయణరావు, వెంకటేశ్వర్లు, ఈడీ సుభాని, జీఎంలు ఎన్వీ రాజశేఖర్‌రావు, సీఎంవో కిరణ్‌రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.