కొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 23: సింగరేణి సంస్థలో పర్యావరణ సమతుల్యాన్ని పాటిస్తున్నామని ఆ సంస్థ సీఎండీ ఎన్.బలరాంనాయక్ పేర్కొన్నారు. ఇందుకోసం సంస్థ సమీప గ్రామాలు, మైన్లు, డిపార్ట్మెంట్లు, ఓబీ డంపుల్లో విరివిగా మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు.
వన మహోత్సవంలో భాగంగా ‘ప్రతీ అడుగు పచ్చదనం’ అనే నినాదంతో సింగరేణిలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో శుక్రవారం ఆయన 235 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణపై తమ సంస్థ మొదటి నుంచీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని, మొక్కలు నాటుతూ అడవులను పెంచుతోందని అన్నారు.
తమ సంస్థ ఆధ్వర్యంలో 2023 వరకు 14,680 హెక్టార్లలో 7.32 కోట్లకుగాపై మొక్కలు నాటామని, ఈ ఏడాది 664 హెక్టార్లలో 13.30 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వివరించారు. కాగా, సీఎండీ స్థాయి అధికారి ఒక్కరే ఒక్కరోజే 235 మొక్కలను నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారంటూ స్థానిక అధికారులు ప్రశంసించారు. జీఎం వెంకటరమణ, ఏజీఎం (డబ్ల్యూ) వివేక్బాబు, డీజీఎం హరినారాయణ, రాజీవ్‌కుమార్, మేనేజర్ ఆర్బీ డేవీడ్ అభిలాశ్ పాల్గొన్నారు.