భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ధాన్యం రైతులు అనుకున్న దిగుబడి అంచనాలు తలకిందులయ్యాయి. ప్రకృతి విపత్తులు, యూరియా కొరత వంటివి ప్రధానంగా ప్రభావం చూపాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ వానకాలం సీజన్లో ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గింది. కాస్తాకూస్తో చేతికొచ్చిన ధాన్యపు గింజలనైనా అమ్ముకుందామంటే ఎక్కడ చూసినా దళారులే రాజ్యమేలుతున్నారు. మరోవైపు తేమశాతం పేరుతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పెడుతున్న నిబంధనలు రైతన్నలకు గుదిబండలా మారాయి. దీంతో ఓపిక నశించిన రైతులు.. ప్రైవేటులో విక్రయించుకునేందుకే మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 105 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించినా.. ఇప్పటివరకు కేవలం 25వేల మెట్రిల్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం.
ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వం నిర్లక్ష్యాల కారణంగా భద్రాద్రి జిల్లా వరి రైతులకు ఈ సీజన్లో నిరాశే మిగిలింది. ఎకరానికి 30 నుంచి 35 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుందనుకున్న రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఎకరాకు కేవలం 20 బస్తాల లోపే దిగుబడి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలం సీజన్లో రైతులు 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. అకాల వర్షాలు, తుపాన్లు వీరిని వెంటాడాయి. సర్కారు నిర్లక్ష్యం, యూరియా కొరత వంటివి తోడయ్యాయి. చివరికి కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు కూడా అడ్డంకిగా మారాయి. పరోక్షంగా అవి రైతులను ప్రైవేటు వైపు మొగ్గుచూపిస్తున్నాయి.
జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 1.65 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటలను సాగుచేశారు. 3 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ చివరికిప్పుడు 2 లక్షల మెట్రిక్ టన్నులు కూడా వచ్చే పరిస్థితి కనబడడం లేదంటూ అధికారులు అంచనాలు సవరిస్తున్నారు. కొంతమంది రైతులు బయటి వ్యాపారులకు విక్రయించినా ఆఖరికి ప్రభుత్వానికి 1.50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యమైనా వస్తుందని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి కొనుగోళ్లు కేంద్రాల్లో అధికారులు 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. అయితే, ఇంకా నెల రోజుల సమయం ఉందంటూ అధికారులు ధీమాగా ఉన్నారు.
ఏడాదంతా చెమటోడ్చిన రైతులకు.. గణనీయంగా తగ్గిన దిగుబడి మరింత దిగులును పెంచుతోంది. దిగుబడులు అమాంతం తగ్గుతుండడంతో పెట్టుబడులు కూడా రాక ఆర్థికంగా ఇబ్బందులు పడే ప్రమాదం కన్పిస్తోంది. చేతికొచ్చిన కొద్దిపాటి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయిద్దామనుకున్నా సవాలక్ష ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కనీసం బోసన్ ఆశలకూ ప్రభుత్వం నీళ్లొదులుతోంది. 17 శాతంలోపు తేమ ఉండాలన్న నిబంధన పెట్టడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసి, వేచి చూసే ఓపిక నశించిన చాలామంది రైతులు దళారులకు, ప్రైవేటు వ్యాపారులకు తమ సన్నరకం పచ్చి వరి ధాన్యాన్ని విక్రయించుకుంటున్నారు.
మా ఊళ్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేశారు. కానీ అక్కడ ధాన్యం కొనుగోలు చేయడం లేదు. అందుకే బయట షావుకార్లకు అమ్ముకుంటున్నాం. పేరుకు మాత్రం సెంటర్ తెరిచారు. కానీ అక్కడ ఎవరూ ఉండడం లేదు. తేమ శాతం ఎంత ఉన్నప్పటికీ బయట కొనుగోలు చేస్తున్నారు. అందుకే ప్రభుత్వ కేంద్రాల వద్దకు రైతులెవరూ వెళ్లడం లేదు.
-పూదోట వెంకటేశ్వరరావు, రైతు, చినబండిరేవు, దుమ్ముగూడెం
నేను రెండు ఎకరాల్లో వరి వేశాను. వర్షాల వల్ల బాగా నష్టపోయాను. దిగుబడి బాగా తగ్గిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకెళ్తే వెంటనే కొనేవారు. ఇప్పుడు అలా కొనట్లేదు. తేమ శాతం నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఉంటేనే కొంటామంటున్నారు. వారా ల తరబడి ఆరబెట్టుకుంటూ అక్కడే ఉండాలంటే కష్టం. అందుకే బయటే విక్రయిస్తున్నాం.
-ఎనగంటి కన్నయ్య, రైతు, చినబండిరేవు, దుమ్ముగూడెం
ఈ ఏడాది వానకాలం సీజన్లో కురిసిన భారీ వర్షాలు మాలాంటి రైతులను బాగా దెబ్బతీశాయి. ఎకరానికి 35 బస్తాల చొప్పున దిగుబడి వస్తుందని అనుకున్నా. కానీ 15 బస్తాలకు మించి రాలేదు. కనీసం నేను పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. అసలే కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న మాకు ఏమీ మిగలట్లేదు. ప్రభుత్వం కూడా నిబంధనలు పెట్టకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
-ఎన్.బోడయ్య, రైతు, దుమ్ముగూడెం
జిల్లాలో 189 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. 105 కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నాం. అన్ని కేంద్రాల్లో గన్నీ బ్యాగులను, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచాం. 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంతకుమించి కొనుగోలు చేస్తాం. వర్షాల వల్ల దిగుబడి తగ్గిన మాట వాస్తవమే. తేమ శాతాన్ని నిర్ణయించేది ప్రభుత్వమే.
-త్రినాథ్బాబు, డీఎం, పౌరసరఫరాలశాఖ అధికారి, కొత్తగూడెం