మణుగూరు టౌన్, నవంబర్ 1 : వివిధ పరిశ్రమలు, సంస్థల నుంచి జిల్లా అభివృద్ధి కోసం అందించే నిధుల లెక్క తేల్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పెద్ద పెద్ద సంస్థలు, పరిశ్రమలు ఉన్నాయని, గోదావరి నుంచి ఇతర ప్రాంతాలకు రోజుకు కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తోలకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
వీటి నుంచి జిల్లాకు రావాల్సిన వందల కోట్ల డీఎంఎఫ్టీ నిధులు, సీఎస్ఆర్ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఆయా నిధులను అధ్వానంగా ఉన్న రోడ్ల అభివృద్ధికి, ఇతర అభివృద్ధి పనులకు వెచ్చించాలని డిమాండ్ చేశారు. 7న ఉదయం 10 గంటలకు మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగే ముట్టడి కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.