ఖమ్మం, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం జిల్లాలో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తితో పోల్చితే ఉపాధ్యాయుల సంఖ్య అవసరానికి మించి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నప్పటికీ పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉపాధ్యాయుల సర్దుబాటు సక్రమంగా చేయకపోవడంతో ఈ దుస్థితి తలెత్తుతున్నది. గతేడాది ఉపాధ్యాయుల సర్దుబాటును అడ్డగోలుగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది ఇంకా ఆ ప్రక్రియను మొదలుపెట్టనే లేదు. జూలై 15వ తేదీ నాటికల్లా ఆయా పాఠశాలల్లో సర్దుబాటు ఉపాధ్యాయులు విధుల్లో చేరాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ నేటికీ ఒక కొలిక్కి రాలేదు. ఏదేమైనా ప్రభుత్వ నిర్లక్ష్యంతో అంతిమంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ఉపాధ్యాయ ఖాళీలతోపాటు భవిష్యత్‌లో ఉద్యోగ విరమణ ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా దృష్టిలో ఉంచుకుని ఆనాడు అవసరానికి మించి ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ చేపట్టింది. ఉపాధ్యాయ ఎంపిక ప్రక్రియ పరీక్షలు నిర్వహించింది. తర్వాత ఎన్నికల కోడ్ అడ్డురావడంతో ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు జారీ చేయలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఉపాధ్యాయులను అట్టహాసంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియానికి వేలాది మందిని పిలిపించి నియామక పత్రాలు అందించారు.
ఈ నేపథ్యంలో గతేడాది ఉపాధ్యాయుల కొరత అన్నది లేకుండా విద్యార్థులకు సరైన ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని అందరూ భావించారు. కా.. ఆచరణలో దీనికి భిన్నంగా ఉంది. ఫలితంగా ఉపాధ్యాయుల సర్దుబాటులో మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చి రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ప్రహసనంగా జరిగింది.
నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు కలెక్టర్ ఆమోదం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఇష్టారీతిన సర్దుబాటు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను కూడా ఒకేసారి అందరికీ తెలిసే విధంగా కాకుండా ఒకరిద్దరు ఉపాధ్యాయుల అవసరాన్ని బట్టి వ్యక్తిగతంగా వారికి మాత్రమే తెలిసేలా జారీ చేశారు. అంతేకాదు ఆ ఉత్తర్వులను రహస్యంగా మళ్లీమళ్లీ మారుస్తూ పోయారు. దీనిపై విద్యాభిమానులు, విద్యావేత్తలు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.
నూతన విద్యాసంవత్సరం ప్రారంభంలోనే కొత్త విద్యాశాఖాధికారి రావడంతో ఉపాధ్యాయుల సర్దుబాటు సకాలంలో జరుగుతుందని అందరూ భావించారు. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా పాఠశాలల ప్రారంభ సమయానికి ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. బడిబాట కార్యక్రమం జూన్ 20 వరకు ఉన్నందున ఆ తర్వాతే విద్యార్థుల సంఖ్యలో స్పష్టత వస్తుందని, జూన్ నెలఖారు నాటికి సర్దుబాటు పూర్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. ఈ మేరకు సర్కార్ స్పందిస్తూ జూలైలోనే సర్దుబాటు పూర్తి చేసి 15వ తేదీ నాటికి ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు చేరాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ.. నేటికీ ఉపాధ్యాయుల సర్దుబాటు ఒక కొలిక్కి రాలేదు.
ఫలితంగా పలు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించడానికి వెనుకాడుతున్నారు. వందలాది మంది చిన్నారులు ఉపాధ్యాయుల కొరత కారణంగా ప్రైవేట్ స్కూల్ బాట పట్టారు. వైరా మండలం అష్ణగుర్తి ఉన్నత పాఠశాలను గత విద్యాసంవత్సరం మూసివేసిన విషయం విదితమే. అష్ణగుర్తి, గోల్లినపాడు గ్రామాలకు చెందిన సుమారు 34 మంది విద్యార్థులు అష్ణగుర్తి ఉన్నత పాఠశాలలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయమై స్థానిక యువకులు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాల ప్రారంభంరోజు వెళ్లారు.
దీంతో అన్ని సబ్జెక్ట్‌లకు ఉపాధ్యాయులు వస్తేనే తమ పిల్లలను పాఠశాలలో చేర్పిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు పట్టుబట్టారు. పాఠశాల నిర్వాహకులు మాత్రం విద్యార్థులు చేరితేనే ఉపాధ్యాయులు వస్తారని చెప్పడంతో చివరకు ఆ పాఠశాలలో అడ్మిషన్లు కరువయ్యాయి. దాదాపు ఇదే పరిస్థితి అనేక పాఠశాలల్లో నెలకొంది. ఒకవైపు మూతపడిన పాఠశాలలను తెరిపించాలని కలెక్టర్ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. ఉన్న పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడే దుస్థితి చాలాచోట్ల ఉంది. దీనికి రెండంకెలకు చేరని విద్యార్థులు నమోదు ఉన్న పాఠశాలలు జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇకనైనా జిల్లా విద్యాశాఖ కార్యాలయం తన పద్ధతి మార్చుకుని నిబద్ధతతో ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.