ప్రభుత్వ ఆసుపత్రులను మందుల కొరత నిత్యం వెంటాడుతున్నది. రోగులకు ఎప్పుడూ ఒకే రకం మందులను అంటగడుతున్నారు. రోగమేదైనా వారి దగ్గర ఉన్నవే ఇస్తరు.. ఎందుకంటే కొత్తవి రావు. లేకుంటే బయటకు రాస్తరు. బయట కొనుక్కోలేని పేదలను రోజుల తరబడి తిప్పుతుంటారు. సర్కార్ ఆసుపత్రులే దిక్కుగా భావించే నిరుపేదల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడమే దీనికి ప్రధాన కారణం. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పట్టించుకొని అన్నిరకాల వ్యాధులకు ప్రభుత్వాసుపత్రుల్లో మందులను సరఫరా చేయాలని పేదలు కోరుతున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ సర్కార్ పాలనలో ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా కనిపిస్తున్నది. పేరుకే జిల్లా ఆసుపత్రి.. అక్కడ చాలా పడకలు ఉన్నాయి.. కానీ రోగులకు మందులు మాత్రం అన్ని రకాలు ఉండవు. ఎన్ని రోజులు తిరిగినా అవే మాత్రలు ఇస్తున్నారు. బీపీ గోలీలు 20 ఎంజీ ఉండవు. గ్యాస్‌కు జిన్‌టాక్ తప్ప వేరేవి కనబడవు. ప్రమాదం జరిగి ఆసుపత్రికి వస్తే ఎక్స్‌రే లేదంటారు. ఆసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేసినా మార్పు రావడం లేదు. ఇది ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని పెద్దాసుపత్రి దుస్థితే కాదు.. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. సరిపడా మందులు లేకపోవడంతో రోగులు సతమతమవుతున్నారు. ఇటీవల రామవరంలో ఉన్న ఎంసీహెచ్‌ను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తనిఖీ చేయగా ఆసుపత్రిలో మందుల కొరత ఉన్నట్లు రోగులు బాహాటంగా విన్నవించుకున్నారు.
చర్మవ్యాధులకు మందులే లేవు..
చర్మవ్యాధులకు సర్కారు ఆసుపత్రిలో వైద్యం లేదనే చెప్పాలి. జిల్లాకేంద్రంలో రెండు ప్రైవేటు ఆసుపత్రుల వద్ద రోగులు ప్రతిరోజూ భారీ క్యూ కడుతున్నారంటే ఇక్కడ వైద్యంపై నమ్మకం లేదని అర్థమవుతున్నది. అక్కడ ఓపీకి 500 ఇచ్చి మరీ లైన్లో ఉంటున్నారంటే ఇక్కడ వైద్యం ఎంతస్థాయిలో ఉందో వేరే చెప్పనక్కర్లేదు. కనీసం సిట్రజన్ మందులు కూడా లేని పరిస్థితి ఏర్పడిందంటే నమ్మరేమో.
జిల్లా అంతటా ఇదే సమస్య..
జిల్లా కేంద్రంతోపాటు అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో మందుల కొరత వెంటాడుతున్నది. జిల్లా కేంద్రంలో డ్రగ్ స్టోర్ ఉంది. అయితే అన్ని మందులు ఉన్నాయంటారు కానీ వైద్యులు మాత్రం చీటీలు బయటకు రాస్తున్నారు. ఇక పల్లె దవాఖానల్లో కూడా అదే పరిస్థితి. వైద్యులు ఉన్నా మందులు లేకపోవడంతో గ్రామాల నుంచి రోగులు పట్టణాలకు వచ్చి ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు.
కళ్లు కనబడటం లేదు..
మూడురోజుల నుంచి తిరుగుతున్నాను. నాకు కళ్లు కనబడటం లేదని వచ్చాను.. మందులు ఉండవు అన్నారు. డ్రాప్స్ ఇస్తున్నారు. అది వేసుకున్నా తగ్గడం లేదు. ఇక్కడ కంటికి సంబంధించి మందులేమీ ఉండవన్నారు. కూలి చేసుకునే నేను ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లలేను. పేదోళ్ల ఆసుపత్రి అని నమ్మి వచ్చాను. మాత్రలు ఇవ్వడం లేదు.
– ధరమ్‌సింగ్, వలస కూలీ, ఛత్తీస్‌గఢ్
ఎలర్జీ ఉందని వచ్చాను..
ఎలర్జీ ఉందని వచ్చాను.. డాక్టర్ చూశారు. కానీ మందులు లేవని చెప్పారు. చర్మవ్యాధులకు ఇక్కడ ఎలాంటి మందులు లేవంట. సిట్రజిన్ ట్యాబ్లెట్స్ పెద్దవాళ్లకు మాత్రమే ఉన్నాయి. పిల్లలకు లేవన్నారు. బయటకు వెళ్తే చాలా డబ్బులు అవుతాయి. ప్రైవేటుకు వెళ్లలేకనే ఇక్కడకు వచ్చాను.
– ప్రేమ్‌కుమార్, పాత కొత్తగూడెం
ఎక్స్‌రే లేదంటున్నారు..
చిన్న యాక్సిడెంట్ అయితే వచ్చాను. ఎక్స్‌రే రాశారు. ఇక్కడ లేదంటున్నారు. బయటకు వెళ్తే చాలా డబ్బులు తీసుకుంటారు. ప్రభుత్వ ఆసుపత్రిలో లేనప్పుడు ఇంత పెద్ద ఆసుపత్రి ఎందుకు కట్టారు. పేరు గొప్ప.. ఊరు దిబ్బలా ఉంది. లైన్లో నిల్చొని చిట్టీ తెచ్చుకుంటే మళ్లీ ఇంటికి పోవాల్సి వస్తున్నది.
– గంధం మల్లికార్జున్, కొత్తగూడెం
మందులు సరిపడా ఉన్నాయి&
గతంలో కొంత సమస్య ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డ్రగ్ స్టోర్‌లో మందులు ఫుల్‌గా ఉన్నాయి. పీహెచ్సీ వాళ్లు ఇండెంట్ పెట్టుకుని తెప్పించుకోవాలి. పూర్తిగా మందులు అయిపోయే వరకు చూడకుండా మూడ్రోజుల ముందుగానే తెప్పించుకుంటే కొరత అనేది ఉండదు. కలెక్టర్ సార్ తనిఖీలు చేసినప్పుడు సమస్యలను రోగులు చెప్పారు. అప్పటి నుంచి అలాంటి సమస్య లేకుండా చూస్తున్నాం. అన్ని ఆసుపత్రులకు మందులు సకాలంలో సరఫరా చేస్తున్నాం. డ్రగ్ స్టోర్ జిల్లా కేంద్రంలోనే ఉంది. రోగులు కొంతమంది సొంతంగా బయటకు రాయించుకుంటున్నారు.
– డాక్టర్ భాస్కర్‌నాయక్, డీఎంహెచ్‌వో
ఎనిమిది రకాలు రాశారు.. రెండు రకాలు ఇచ్చారు..
రోగం వచ్చిందని వెళ్లాను.. ఎనిమిది రకాల మందులు రాశారు. అందులో రెండు రకాలు ఇచ్చారు. మిగతావి తర్వాత రమ్మన్నారు. ఎన్నిరోజులు తిరగాలో అర్థంకావడం లేదు. ఆటో చార్జీలకే బాగా డబ్బులు అవుతున్నాయి. ఎప్పుడూ అవే మాత్రలు ఇస్తున్నరు. బీకాంప్లెక్స్ మాత్రలు లేవన్నారు. అసలైనవి లేవంటున్నారు.. వేరే మాత్రలు ఇస్తున్నారు.
– తాజుద్దీన్, హనుమాన్‌బస్తీ, కొత్తగూడెం
ఒకటి అడిగితే మరొకటి ఇస్తున్నారు..
గ్యాస్ సమస్య ఉందని వస్తే ఎప్పుడూ ఇచ్చే పాత గోలీలు ఇస్తున్నారు. జిన్‌టాక్ తప్ప ఏమీ లేవు. ఖరీదైన మందులు తెప్పించడం లేదు. ఎర్రగోలీలు ఇచ్చి పంపిస్తున్నారు. యాంటిబయాటిక్‌లు లేవని చెబుతున్నారు. సిఫ్రోప్లక్సిన్ లేవంటున్నారు. దానికి బదులు వేరే మందులు ఇచ్చి పంపిస్తున్నారు. ఎప్పుడు వచ్చినా ఇదే సమస్య. ఈ ఆసుపత్రి తీరు మారదు. అంతా బురదమయం.. ముక్కు మూసుకుని రావాల్సి వస్తున్నది.
– ధారా రమేష్, గాజులరాంబస్తీ, కొత్తగూడెం