మధిర, జులై 02 : విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలని ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య దుకాణదారులకు సూచించారు. బుధవారం మధిర మండలంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి స్టాక్ ను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మండలం విత్తన, ఎరువుల దుకాణం డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించకుండా తగినంతగా రైతులకు అందించాలని తెలిపారు. నిబంధనలు పాటించని డీలర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏడీఏ మధిర విజయచంద్ర మాట్లాడుతూ.. డీలర్లందరూ స్టాక్ బోర్డులు, స్టాక్ రిజిస్టర్లు ఎప్పటికప్పుడు నిర్వహించాలన్నారు. అలాగే రైతులకు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం రాయపట్నం గ్రామంలోని పచ్చిరొట్ట వేసిన పొలంను సందర్శించారు. పచ్చిరొట్ట ఎరువుల ప్రయోజనాలను, ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. పచ్చిరొట్ట వాడకం వల్ల భూమిలో సహజ సిద్ధంగా నత్రజని, భాస్వరం, పొటాష్ నిల్వలు పెరుగుతాయన్నారు.