అశ్వారావుపేట, ఫిబ్రవరి 12 : ‘సీడ్ విత్తనం’ పేరిట విత్తన కంపెనీలు మాయాజాలం చేశాయి. మొక్కజొన్న రైతులను నిండా ముంచాయి. ఎకరాకు 3 నుంచి 6 టన్నుల వరకు దిగుబడి వస్తుందంటూ ప్రచార ఆర్భాటాలతో మభ్యపెట్టిన కంపెనీల ఏజెంట్ల్లు.. ఇప్పుడు మాట మార్చుతున్నారు. అశ్వారావుపేట మండలవ్యాప్తంగా 600 ఎకరాల్లో సీడ్ విత్తనం సాగు ప్రయోగం విఫలమైంది. దీంతో రైతులు రూ.1.20 కోట్ల మేరకు నష్టపోయారు. బాండ్లు ఇవ్వకుండా పెట్టుబడి సాకుతో కంపెనీ ఏజెంట్లు నిలువునా మోసం చేశారు. వాస్తవంగా ఏజెంట్ల ప్రమేయం లేకున్నా కంపెనీలు మధ్యవర్తిగా వీరినే రైతుల వద్దకు పంపుతున్నాయి. టన్నుకు రూ.30 వేలు ధర చెల్లిస్తామని చెబుతున్నప్పటికీ నిరాశాజనకమైన దిగుబడే వస్తోంది. దీంతో అసలు పెట్టుబడి రాకపోగా.. రూ.20 వేల చొప్పున రైతులు నష్టపోతున్నారు. పంట కాలపరిమితి పూర్తవుతున్నప్పటికీ కాపు కనిపించక.. దిగుబడి ఆశాజనకంగా లేక మొక్కజొన్న రైతులు దిగాలు చెందుతున్నారు. వ్యవసాయ శాఖ పర్యవేక్షణ లోపం; కంపెనీలు, ఏజెంట్ల మోసం.. వెరసి రైతులకు శాపంగా మారాయి.
అశ్వారావుపేట మండలంలో మొక్కజొన్న విత్తన కంపెనీల ప్రయోగం బెడిసికొట్టింది. ఫలితంగా సాగుచేసిన రైతులే ఆర్థికంగా నష్టపోతున్నారు. మధ్యలో కంపెనీలు, ఏజెంట్లు లాభపడుతుండగా.. మరి వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం లభించడం లేదు. కొన్ని విత్తన కంపెనీలు విత్తన ఉత్పత్తి కోసం దిగుబడి, ధరలపై రైతులకు భరోసా కల్పించి సాగును ప్రోత్సహిస్తున్నాయి. ఇలా మండలంలోని నారాయణపురం, గాండ్లగూడెం, అనంతారం వంటి గ్రామాల్లో రెండు ప్రముఖ మొక్కజొన్న కంపెనీలు రైతుల ద్వారా మూడు రకాల సీడ్ మొక్కజొన్న సాగు చేపట్టాయి. సాగు చేసినందుకుగాను కంపెనీ విత్తనాలను బట్టి ఎకరాకు 3 నుంచి 6 టన్నులు దిగుబడి వస్తుందని ఏజెంట్లు రైతులకు గ్యారెంటీ ఇచ్చారు. టన్ను ధర రూ.30 వేలు చెల్లిస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ.. పంట కాలపరిమితి పూర్తవుతున్నప్పటికీ కనీసం ఒక టన్ను దిగుబడి కూడా రావట్లేదు. ఫలితంగా రైతులకు అసలు పెట్టుబడి సహా అంతా నష్టపోవాల్సి వస్తోంది. దీనికి తోడు రైతుల ఆరుగాలం శ్రమ కూడా ఆవిరైపోతోంది. మండలంలో సుమారు 600 ఎకరాల్లో సీడ్ మొక్కజొన్న సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
సీడ్ మొక్కజొన్న అంటే..
అధిక ఉత్పత్తి సాధించే దశగా మొక్కజొన్న విత్తన కంపెనీలు ప్రయోగాలు చేస్తుంటాయి. ఇందుకు కొత్త వంగడాలను ప్రయోగాత్మకంగా రైతుల ద్వారా సాగు చేయిస్తుంటాయి. కొత్త వండగాల సాగుపై నమ్మకం లేని రైతులు నిరాకరిస్తారు. వారిని ఒప్పించేందుకు కంపెనీలు ఎకరాకు ఇంత దిగుబడి వస్తుందని, టన్ను కనీస ధరగా ఫలానా మొత్తం చెల్లిస్తామని స్పష్టంగా హామీ ఇస్తుంటాయి. ఇందుకోసం రైతులతో ఒప్పందాలు(అగ్రిమెంట్లు) చేసుకుంటాయి. ఆ అగ్రిమెంట్ బాండ్లను రైతులకు అందిస్తాయి. కానీ.. కొన్ని కంపెనీలు మాత్రం ఏజెంట్లను మధ్యవర్తిగా నియమించుకొని ప్రయోగాలు చేస్తాయి. అలాంటి కంపెనీల ఏజెంట్లకు రైతులతో ఎటువంటి సంబంధం లేకున్నా రైతులను మభ్యపెట్టి కంపెనీల తరఫున పూర్తి గ్యారెంటీ ఇస్తారు. అగ్రిమెంట్లు మాత్రం రైతులకు ఇవ్వరు. కంపెనీ నుంచి తీసుకున్న అగ్రిమెంట్లను ఏజెంట్లు తమ వద్దనే ఉంచుతారు. ప్రయోగం విఫలమైనా కంపెనీల నుంచి లాభం పొందుతుంటారు.
కమిషనర్ నుంచే అనుమతి..
విత్తన కంపెనీలు వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచే విత్తన ఉత్పత్తికి అనుమతి తీసుకుంటాయి. కంపెనీలు మండలస్థాయి అధికారికి సమాచారం ఇచ్చిన తర్వాతే రైతులకు విత్తనాలు అందించాలి. కానీ.. ఇవేమీ లేకుండానే కంపెనీలు ఏజెంట్లను రంగంలోకి దింపి అనధికారికంగా విత్తన సాగు చేస్తున్నాయి. ఒకవేళ ప్రయోగం విఫలమైనా కంపెనీ నేరుగా బాధ్యత వహించదు. ఏజెంట్లు కూడా రైతులకు అగ్రిమెంట్ల ఇవ్వరు కాబట్టి రైతులు ప్రశ్నించే హక్కులు కోల్పోతున్నారు. రైతుల సమన్వయం లేకపోవడం; కంపెనీలు, ఏజెంట్లు సమాచారం ఇవ్వకపోవడం వంటి కారణాలతో మండల వ్యవసాయాధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. అగ్రిమెంట్లు తీసుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. ఏజెంట్లు ముందుగానే పెట్టుబడి సాయం ఇస్తుండడంతో రైతులు కూడా అగ్రిమెంట్లను అడగడం లేదు. అంతిమంగా రైతులే నష్టపోతున్నారు.
ఎకరాకు రూ.20 వేలకు పైగా నష్టం..
విత్తన కంపెనీల హామీతో ఆశపడి సీడ్ సాగు చేస్తున్న రైతులు చివరికి ఒక్కో ఎకరానికి రూ.20 వేలకు పైగా నష్టం ఎదుర్కొన్నారు. దుక్కులకు రూ.5 వేలు, కూలీలకు రూ.5 వేలు, కౌలు రూ.20 వేలు, ఎరువులు రూ.15 వేలు, పురుగు మందులు రూ.15 వేల చొప్పున సాగుకు రైతులు ఎకరానికి రూ.60 వేల నుంచి రూ.65 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. 3 నుంచి 4 టన్నుల దిగుబడి వస్తుందని కంపెనీ గ్యారెంటీ ఇచ్చింది. కానీ.. చందా కుమారస్వామి అనే రైతుకు ఒకటిన్నర టన్ను మాత్రమే దిగుబడి వచ్చింది. ఈ లెక్కన కంపెనీ ధర రూ.30 వేల ప్రకారం ఆ రైతుకు రూ.45 వేలు మాత్రమే ఆదాయం వస్తుంది. కానీ.. అప్పటికే ఆ రైతు అదనంగా రూ.20 వేలు పెట్టుబడి పెట్టాడు. ఈ నష్టం రైతు భరించాల్సి వస్తోంది. అలాగే సుమారు 120 రోజులపాటు సాగు కోసం చేసిన శ్రమ ఏజెంట్ల దోపిడీతో ఆవిరైపోతోంది. వ్యవసాయాధికారుల అంచనా మేరకు 600 ఎకరాల్లో రూ.1.20 కోట్ల మేర రైతులు నష్టపోయారు.
టన్ను దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు..
నాకు ఇచ్చిన విత్తనం ఎకరాకు 5 టన్నుల దిగుబడి వస్తుందని ఏజెంట్ హామీ ఇచ్చాడు. టన్ను ధర రూ.30 వేలు చెల్లిస్తానని చెప్పాడు. పంట కాలపరిమితి పూర్తవుతోంది. ఎకరాకు కనీసం టన్ను దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. కంపెనీ గ్యారెం టీ ప్రకారం ఎకరాకు ఆదాయం రూ.1.50 లక్షలు రావాలి. కానీ.. రూ.30 వేలు కూడా వస్తుందనే నమ్మకం లేదు. అయితే అగ్రిమెంట్ అవసరం లేదని, కాటా వద్దే తూకం వేసి నగదు చెల్లిస్తానని ఏజెంట్ నమ్మబలికాడు. రూ.20 వేల నగదు, పురుగు మందులు, ఎరువులు ఇచ్చారు. ఏజెంట్ వల్ల మోసపోయాను.
-తుమ్మల మణికంఠ, రైతు, నారాయణపురం
కంపెనీలు సమాచారం ఇవ్వడం లేదు..
కమిషనర్ నుంచి తీసుకున్న అనుమతితోపాటు ఏ రైతులతో ఎంత విస్తీర్ణంలో విత్తన సాగు చేయిస్తున్నారోనన్న సమాచారం ఇవ్వాలని కంపెనీలు, ఏజెంట్లను అడిగాము. అయినా అటు నుంచి స్పందన రావడం లేదు. వ్యవసాయ శాఖకు సమాచారం ఇచ్చిన తర్వాతే రైతులకు సీడ్ సరఫరా చేయాలని, రైతులకు కూడా కంపెనీల నుంచి అగ్రిమెంట్లు తీసుకోవాలని మరీమరీ చెబుతున్నాం. పంట పెట్టుబడి ఆశతో రైతులు కూడా ఏజెంట్లను అగ్రిమెంట్లు అడగడం లేదు. రైతుల వద్ద అగ్రిమెంట్ లేకపోతే నష్టం వచ్చినప్పుడు ఏమీ చేయలేం.
-పొలిమేర శివరాంప్రసాద్, ఏవో, అశ్వారావుపేట