కూసుమంచి (నేలకొండపల్లి)/ ముదిగొండ, ఆగస్టు 14: నేలకొండపల్లి మండలంలో జ్వరాల తీవ్రత తగ్గడం లేదు. ఇక్కడి ప్రభుత్వాసుపత్రికి బుధవారం కూడా 450కిపైగా రోగులు రావడం ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది. వారం రోజులుగా దాదాపుగా ఇంతే సంఖ్యలో రోగులు వస్తుండడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. అవసరమైన వారికి స్లైన్లు ఎక్కించి ఇళ్లకు పంపారు.
బుధవారం ఖమ్మం ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేసే యంత్రం మొరాయించడంతో ఇక్కడి రోగుల నుంచి రక్త నమూనాలను సేకరించలేదు. ఇక్కడి వైద్యశాలలో 30 బెడ్లు మాత్రమే ఉండడంతో ఇన్ పేషెంట్లకు ఇబ్బంది కలుగుతోంది. అవి సరిపోకపోవడంతో తక్షణ వైద్య సహాయం అందించి ఇళ్లకు పంపిస్తున్నారు. ఇక నేలకొండపల్లి మండలంలోనూ డెంగీ ప్రబలుతోంది.
సీజనల్ వ్యాధులు కూడా సమాంతరంగానే ఉన్నాయి. ముదిగొండ మండలంలో గడిచిన రెండు నెలల కాలంలో మూడు డెంగీ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇటీవల న్యూ లక్ష్మీపురంలో మరో డెంగీ కేసు రావడంతో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ వెంకటరమణ బుధవారం ఆ గ్రామాన్ని సందర్శించారు. సదరు రోగి ఇంటికి వెళ్లి పరీక్షించి వైద్యం అందుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారులు నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్యాధికారి అరుణాదేవి పాల్గొన్నారు.