ఖమ్మం అర్బన్, జూన్ 14 : ఆటపాటలతో ఇన్నాళ్లూ సందడి చేసి చిన్నారులు ఇక బడిబాట పడుతున్నారు. పాఠశాలలకు ఆదివారంతో వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి తరగతి గదుల తలపులు తెరుచుకోనున్నాయి. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ విద్యాసంవత్సరం ప్రారంభమవుతోంది. సమస్యల సుడిగుండంలోనే బడి గంటలు మోగుతున్నాయి. సర్కారు బడుల్లో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు ఎన్నో సమస్యలున్నాయి. విద్యారంగ సమస్యలను యథాతథంగా మోస్తూనే నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఈ విద్యాసంవత్సరానికి పేరులోనే నూతనత్వం తప్ప మిగతా ఏ ఒక్క అంశంలోనూ నూతనత్వం లేకుండా ప్రారంభమవుతోంది. రాష్ట్రంలో విద్యారంగాన్ని పటిష్టం చేయడమే తమ తొలి ప్రాధాన్యమంటూ రెండున్నరేళ్ల క్రితం చెప్పిన కాంగ్రెస్ సర్కార్.. ఆచరణలో మాత్రం ఆ దిశగా ఒక్క అంగుళం కూడా ముందడుగు వేయకపోవడం గమనార్హం.

ఖమ్మం జిల్లాలో విద్యాశాఖాధికారి లేకుండానే ఈ విద్యాసంవత్సరం ప్రారంభమవుతోంది. ఇప్పటి వరకు పనిచేసిన డీఈవో సెలవులో వెళ్లారు. దీంతో ‘కొత్తగా డీఈవోను నియమిస్తారా? ఎవరికైనా ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారా?’ అనే అంశం తేలాల్సి ఉంది. పూర్తిస్థాయిలో డీఈవో ఉంటేనే విద్యాసంవత్సరం ప్రారంభానికి కావాల్సిన చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. డీఈవో లేకుండానే బడుల ప్రారంభమంటే అవి ఏ స్థాయిలో సిద్ధమవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల పరిసరాలు ఆహ్లాదంగా కాకుండా సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలకుతున్నాయి. వేసవి సెలవుల్లో మరమ్మతులు చేయకుండానే సర్కారు బడులను వినియోగంలోకి తీసుకొస్తున్నారు. కీలకమైన ఉపాధ్యాయుల సర్దుబాటు కూడా చేయనేలేదు. జూన్, జూలై నెలల్లో ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందే చోట, విద్యార్థుల కంటే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నచోట, ఉపాధ్యాయులు అవసరమైన చోటకు వారిని సర్దుబాటు చేయాల్సి ఉంది. కానీ, అలాంటివేమీ లేకుండానే ఈ నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతోంది.

కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తికి మించి ఉపాధ్యాయులు ఉన్నారు. మరికొన్ని చోట్ల ఈ నిష్పత్తి తక్కువగా ఉండి ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. దీంతో ఖమ్మం జిల్లాలో ఏటికేడాది విద్యార్థుల్లేక మూతపడుతున్న పాఠశాలల సంఖ్య పెరుగుతోంది. గత విద్యాసంవత్సరం నాటికి ఆ సంఖ్య 54కి చేరుకుంది. దీంతోపాటు రెండంకలకు చేరని విద్యార్థులున్న పాఠశాలల సంఖ్య 130గా ఉంది. ఇవి కూడా రేపోమాపో మూతబడడం ఖాయంగా కనిపిస్తోంది. గత అనుభవాలను విస్మరిస్తున్న కాంగ్రెస్ పాలకులు, ఉన్నతాధికారుల వైఖరి కారణంగా ఈ స్థితి తలెత్తుతోంది.
దీంతో జిల్లాలో విద్యారంగం క్షీణదశకు చేరుకుంది. ఖమ్మం జిల్లాలో 211 ఉన్నత పాఠశాలలుండగా 165 మంది మాత్రమే ప్రధానోపాధ్యాయులు పనిచేస్తున్నారు. 37 ఖాళీలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో కలిపి 5,223 మంది ఉపాధ్యాయులు పనిచేయాల్సి ఉండగా 4,940 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 250కిపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత బదిలీల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలలు సైతం ఉపాధ్యాయుల కోరుకోకుండా వివిధ కారాణాల వల్ల మిగిలిపోయాయి.

ఈ ఏడాది సర్కారు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిరాశ ఎదురుకానుంది. దీనికి కారణం.. బడి తెరిచిన వెంటనే కొత్త పుస్తకాలు, యూనిఫాం అందజేసే పరిస్థితి లేకపోవడమే. ఇప్పటికి వరకూ జిల్లాకు అవసరమైన పాఠ్య పుస్తకాలు 4,45,820. కానీ, ఇప్పటి వరకు చేరినవి 4,05,420 మాత్రమే. మండల విద్యాశాఖాధికారుల ద్వారా పాఠశాలలకు పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదు. 2, 5, 6, 8, 9 తరగతుల పుస్తకాలు ఇంకా రావాల్సి ఉంది.
జిల్లాలో యూనిఫాం విషయం కూడా ఆశాజనకంగా ఏమీ లేదు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు (1,178) యూనిఫామ్ క్లాత్ అందజేయాలి. అయితే, వస్త్రం జిల్లాకు వచ్చేందుకే ఇంకా పది రోజుల సమయం పడుతుందని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేజీబీవీలకు మాత్రం నేరుగా టీజీఎస్‌సీవో నుంచి సరఫరా అయింది. వాటిని ఏపీఎంల ద్వారా సెర్ప్ టీమ్‌ల బాధ్యులు యూనిఫాం సిద్ధం చేసే పనిలో ఉన్నారు. పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు రెండు జతల యూనిఫాం అందజేస్తామని ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తీరా వస్త్రం కూడా అందించని పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం నాణ్యత, కొలతల్లో హెచ్చుతగ్గుల వల్ల తల్లిదడ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన విషయం విదితమే.