ఖమ్మం అర్బన్, జూన్ 12 : వేసవి సెలవుల తర్వాత తెరుచుకున్న సర్కారు పాఠశాలలు విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలికాయి. సర్కారు పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు ఇబ్బందులకు కలగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తామని, ఎలాంటి లోటు లేకుండా చూస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ నీటిమూటలయ్యాయి. ఏ పాఠశాలలో చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయి.
నూతన విద్యాసంవత్సరం గురువారం నుంచి ప్రారంభం కావడంతో వేసవి సెలవుల్లో ఇన్నాళ్లు ఆడిపాడిన విద్యార్థులు భారంగా బడిబాట పట్టారు. పై తరగతులకు వెళ్లే విద్యార్థులు భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకుని పాఠశాలలకు పయనమయ్యారు. దాదాపు 50 రోజుల తర్వాత పాఠశాలలు తెరుచుకోవడంతో తొలిరోజు తమ మిత్రులను కలుసుకొని ఆనందంగా గడిపారు. దీంతో జిల్లాలోని పాఠశాలలన్నీ పిల్లలతో సందడిగా కనిపించాయి.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతోనే స్వాగతం పలికాయి. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు సరైన సౌకర్యాలు లేకుండానే బడిగంట మోగింది. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సమస్య వేధిస్తోంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించకుండానే అధికారులు నూతన విద్యాసంవత్సరాన్ని ప్రారంభించారు. కనీసం పాఠశాలల్లో మరమ్మతు పనులు కూడా చేయించలేదంటే ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో ఇట్టే అర్థమవుతోంది. బడిబయట మాత్రం పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చుదువులు చెబుతామంటూ అధికారులు ఆర్భాటం చేస్తున్నారు. వ్యవస్ధలోని లోపాలు సర్కార్ పాఠశాలల ఖ్యాతికి మచ్చగా నిలుస్తున్నాయి.
జిల్లాలో తొలిరోజు పాఠశాలల్లో 48 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 21 మండలాల్లో అత్యధికంగా కల్లూరు మండలంలో 68 శాతం హాజరుకాగా.. తర్వాత స్థ్ధానాల్లో కొణిజర్ల 59 శాతం, ఎర్రుపాలెం 57 శాతం, తల్లాడ 55 శాతం, నేలకొండపల్లి, కామేపల్లి 52 శాతం ఉన్నాయి. సింగరేణి, చింతకానిలో 51 శాతం నమోదైంది. అత్యల్పంగా ఖమ్మం అర్బన్‌లో 37 శాతం, కూసుమంచి 38 శాతం, బోనకల్లు 40 శాతం ఉంది.
రఘునాథపాలెం మండలం పువ్వాడ నగర్‌లోని మండల ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూతపడిన పాఠశాలలను పునఃప్రారంభిస్తున్నామని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఈవో సామినేని సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.