ఖమ్మం అర్బన్, జూన్ 15: ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం రోజున విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఓ సెంటిమెంట్ అడ్డొచ్చింది. దీంతో విద్యార్థుల హాజరుశాతం గణనీయంగా తగ్గింది. ఖమ్మం జిల్లాలో కేవలం 18 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరుకావడం, ఏకంగా 82 శాతం మంది విద్యార్థులు హాజరుకాకపోవడం గమనార్హం. అదే.. అమావాస్య సెంటిమెంట్. నిజానికి ఏటా జూన్ 12 నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. వేసవి సెలవుల అనంతరం ఆ రోజు విద్యార్థులందరూ బడివైపు అడుగులేస్తారు.
కానీ, ఈ సారి ఎండల తీవ్రత కారణంగా ప్రభుత్వమే కొంత వెసులుబాటు కల్పించింది. జూన్ 12న ప్రారంభం కావాల్సిన పాఠశాలలను జూన్ 15న సోమవారం ప్రారంభించాలని భావించింది. కానీ, సోమవారం అమావాస్య సెంటిమెంట్ కారణంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను సోమవారం పాఠశాలలకు పంపలేదు. వేసవి సెలవులకు టాటా చెప్పేసి.. పుస్తకాల సంచి భుజాన వేసి.. బుడిబుడి అడుగులతో బడివైపు అడుగు వేయాల్సిన చిన్నారి విద్యార్థులు సోమవారం కాస్త నిరాసక్తత ప్రదర్శించారు.
అమావాస్య సెంటిమెంట్ కారణంగా తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు మొగ్గుచూపలేదు. కొద్దిమంది మాత్రమే బడిబాట పట్టారు. 50 రోజుల వేసవి సెలవుల్లో ఆటపాటలతో ఇన్నాళ్లూ ఇళ్లలో సరదాగా గడిపిన విద్యార్థులు బడిబాట పట్టేందుకు సోమవారం సమయం ఆసన్నమైంది. అమావాస్య కారణంగా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపలేదు. మరికొందరు తల్లిదండ్రులు పంపేందుకు సిద్ధమైనా విద్యార్థులు మారాం చేశారు. దీంతో తల్లిదండ్రులు కూడా తొలిరోజే తమ పిల్లలను అంతగా దండించలేదు. దీంతో హాజరుశాతం గణనీయంగా తగ్గింది.
ఖమ్మం జిల్లాలో హాజరైన కొద్దిమంది విద్యార్థులకు కూడా సర్కారు బళ్లు సమస్యలతో స్వాగతం పలికాయి. మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకుండాపోయాయి. ఉపాధ్యాయులకూ అదే పరిస్థితి ఎదురైంది. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందడుగు వేయలేదు. కనీస మరమ్మతులు కూడా నిర్వహించలేదు.
విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల మోత మోగించేందుకు ప్రైవేటు పాఠశాలలు సిద్ధమయ్యాయి. పెరిగిన పాఠ్యపుస్తకాల ధరలు, మోతెక్కిస్తున్న ఫీజుల భారంతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటులో ఎల్కేజీ నుంచే రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా ఎక్కువమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌లోనే చదివించేందుకు సిద్ధమయ్యారు. బస్సు ఫీజులు, యూనిఫాం ధరలు దడపుట్టిస్తున్నా ప్రైవేటుకే మొగ్గు చూపుతున్నారు.
నూతన విద్యాసంవత్సరం ఏటా జూన్ 12న ప్రారంభమవుతుంది. కానీ, అందుకు భిన్నంగా ఈసారి జూన్ 15న ప్రారంభమైంది. అయితే, ఇదే రోజున అమావాస్య కావడంతో పాఠశాలలకు హాజరయ్యేందుకు విద్యార్థులు, వారిని పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చలేదు. దీంతో పలు మండలాల్లో విద్యార్థులు హాజరు గణనీయంగా తగ్గింది. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులెవరూ రాకపోవడంతో మధ్యాహ్నం తర్వాత హెచ్ఎంలు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కొందరిని తీసుకొచ్చారు. దీంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 18 శాతమే హాజరు నమోదైంది.
జిల్లాలోని 21 మండలాల్లో అత్యధికంగా ఎర్రుపాలెం మండలంలో 36 శాతం, తరువాత నేలకొండపల్లి, సత్తుపల్లిల్లో 24 శాతం, రఘునాథపాలెంలో 23 శాతం, కల్లూరు, ఖమ్మం రూరల్‌లో 22 శాతం హాజరు నమోదైంది. అత్యల్పంగా మధిర, చింతకాని, పెనుబల్లి, తిరుమలాయపాలెంలో 15 శాతం, ఖమ్మం అర్బన్‌లో 11 శాతం హాజరు నమోదైంది. అలాగే, జిల్లాలో 5,944 మంది ఉపాధ్యాయులకుగాను 5,122 మంది ఉపాధ్యాయులు తొలి రోజు హాజరయ్యారు. 86.17 శాతం హాజరు నమోదైనట్లు విద్యాశాఖాధికారులు పేర్కొన్నారు.
కొత్తగూడెం గణేశ్‌టెంపుల్, జూన్ 15:వేసవి సెలవులు ముగిసిన అనంతరం భద్రాద్రి జిల్లాలో సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అయితే, తొలిరోజు విద్యార్థుల హాజరుశాతం గణనీయంగా 13 శాతానికి పడిపోయింది. ఏకంగా 87 శాతం మంది విద్యార్థులు మొదటి రోజున పాఠశాలలకు గైర్హాజరయ్యారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మొత్తం 44,096 మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంది. కానీ, 5,540 మంది మాత్రమే బడిబాట పట్టారు. అమావాస్య సెంటిమెంట్, అధిక ఎండ కారణంగా పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఆసక్తి చూపలేదు.