కారేపల్లి, జూన్ : 16 : పాఠశాల వయస్సు గల ప్రతి చిన్నారి విద్యకు దూరం కాకుండా బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి పాఠశాలలో చేర్పించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. సింగరేణి మండల పరిధిలోగల విశ్వనాథపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, మౌళిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు, పరిశుభ్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు,ఏకరూప దుస్తుల పంపిణీ ప్రక్రియను సమీక్షించి, ప్రతి విద్యార్థికి అన్ని సౌకర్యాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి పాఠశాల వయస్సు గల ప్రతి చిన్నారిని గుర్తించి పాఠశాలల్లో నమోదు చేయాలని తెలిపారు. ఉపాధ్యాయులందరూ సమయ పాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలన్నారు.
పాఠశాల వంటగది, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతతో పాటు పరిశుభ్రత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఆహార పదార్థాల నిల్వ, వంట ప్రక్రియ, తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలు, ఆరోగ్య సేవల అమలుపై ఆరా తీశారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు కీలకమని, పిల్లలకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పరిసరాల్లో పరిశుభ్రతను నిరంతరం పాటించాలని, పారిశుద్ధ్య పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని ఆదేశించారు. పరిశుభ్రమైన వాతావరణం విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభ్యాసానికి ఎంతో అవసరమన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట సింగరేణి తాసీల్దార్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, విద్యా శాఖ సిబ్బంది ఉన్నారు.

బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి : కలెక్టర్ దివాకర టీఎస్