విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్న చిత్రం ‘డార్క్ చాక్లెట్’. శశాంక్ శ్రీవాస్తవ దర్శకుడు. స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి రానా దగ్గుబాటి సమర్పకుడు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమాలోని తొలి పాటను హైదరాబాద్‌లో నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్లో మేకర్స్ విడుదల చేశారు.
ఇది సినిమాలో ముఖ్యమైన సందర్భంలో వచ్చే పాటని, వివేక్ సాగర్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారని, లిరిక్స్ కూడా అర్థవంతంగా ఉంటాయని, ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకునే సినిమా అవుతుందని హీరో విశ్వదేవ్ నమ్మకంగా చెప్పారు. ఈ పాటలో కథ నిక్షిప్తమై ఉంటుందని, బాలాదిత్య సాహిత్యం, అనురాగ్ కులకర్ణి గానం ఈ పాటకు ప్రధాన బలమని దర్శకుడు శశాంక్ పేర్కొన్నారు. ఇంకా నటి బిందుమాధవి, నందకిశోర్, వివేక్‌సాగర్, అనురాగ్ కులకర్ణి కూడా మాట్లాడారు.