జూలూరుపాడు, ఆగస్టు 16 : సీతారామ ప్రాజెక్టులోని ‘వైరా రాజీవ్ లింక్’ కాలువలో మరోసారి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం బయటపడింది. కుటిల బుద్ధితో గత ప్రభుత్వ ఉద్దేశానికి విరుద్ధంగా చేపట్టిన వైరా రాజీవ్ లింక్ కాలువలోని సైడ్ బర్ములు మళ్లీ కొట్టుకుపోయాయి. ఇదే కాలువలోని సైడ్ బర్ములు పొరుగునే ఉన్న ఏన్కూరులో మూడు రోజుల క్రితమే కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం జూలూరుపాడు మండలం వినోభానగర్లోనూ ఊడ్చుకెళ్లాయి. దీంతో సీతారామ లింక్ కాలువలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.కోట్లతో చేపట్టిన ఆర్భాటపు పనులు నీటిపాలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌లో ఒక్క పిల్లర్ కుంగినందుకే కూలేశ్వరమంటూ కూసినోళ్లు సీతారామ ప్రాజెక్టు ఉద్దేశానికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థంతో నిర్మించిన రాజీవ్ లింక్ కెనాల్ సైడ్ పలకలు గోదావరి నీళ్లలో కొట్టుకుపోతుంటే ఏం సమాధానం చెప్తారంటూ స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భద్రాద్రి జిల్లా బీజీ కొత్తూరులో గోదావరిపై సీతారామ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికే ఈ ప్రాజెక్టును 80 శాతం పూర్తిచేశారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలోని సుమారు పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనేది కేసీఆర్ ఉద్దేశం. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నెలల తరబడి ఈ ప్రాజెక్టు పనులను పెండింగ్‌లో పెట్టింది. తరువాత ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు రంగంలోకి దిగి.. సీతారామ ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యాలకు విరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారు.
పైగా, తమ నియోజకవర్గాలకు మేలు జరిగేలా కాలువల అలైన్మెంట్ మార్చుకున్నారు. ఇందులో భాగంగానే ఏన్కూరు సమీపంలోని సీతారామ ప్రాధాన కాలువకు అడ్డుకట్ట వేశారు. కృష్ణా నదిలో నీళ్లు లేని సమయంలో ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్ఎస్పీ) ఆయకట్టుకు గోదావరి నీళ్లను మళ్లించేందుకు, దాంతోపాటు తమ నియోజకవర్గాలకూ ఆ నీళ్లను తరలించుకునేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఏన్కూరు వద్ద ‘రాజీవ్’ పేరిట లింక్ కెనాల్ నిర్మించి ఎన్ఎస్పీ ప్రధాన కాలువకు లింక్ చేశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆ లింక్ కాలువను కూడా నాసిరకంగా నిర్మించారు.
నిరుడు మార్చి 5న యాసంగి పంటల కోసమని ఇదే కాలువలో స్వల్పంగా నీళ్లు విడుదల చేశారు. తాజాగా, ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వానకాలం పంటల కోసం రెండోసారి నీటిని విడుదల చేశారు. ఈ రెండోసారి పారిన నీళ్లకే ఆ కాలువకు ఇరువైపులా ఉన్న సిమెంటు బర్మ్‌లు కుంగిపోయి నీళ్లలో కొట్టుకుపోయాయి. దీంతో స్థానిక రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వం నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంవల్లే కాలువలోని సిమెంట్ పలకలు నీళ్లలో కొట్టుకుపోతున్నాయని మండిపడుతున్నారు. రూ.కోట్ల ప్రజాధనంతో ఏర్పాటుచేసిన కాలువ పలకలు దశాబ్దాలపాటు మన్నికగా ఉండకుండా కొద్దిరోజులకే కొట్టుకుపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఏన్కూరు మండలంలో రూ.72 కోట్లతో నిర్మించిన రాజీవ్ లింక్ కాలువ సైడ్ బర్ములు శుక్రవారం నీళ్లలో కొట్టుకుపోయాయి. దీనిపై ‘నమస్తే తెలంగాణ’లో శనివారం ఉదయమే కథనాలు రావడంతో స్పందించిన ప్రభుత్వం ఆగమేఘాల మీద శనివారం సాయంత్రానికి మరమ్మతులు చేపట్టింది. ఆ మరుసటి రోజైన ఆదివారం ఏన్కూరుకు పొరుగునే ఉన్న జూలూరుపాడు మండలం వినోభానగర్ వద్ద అదే కాలువలో రెండు వైపులా ఉన్న బర్ములు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఇక్కడ రూ.80 కోట్లతో నిర్మించిన సిమెంటు పలకలు గంగలో కలిశాయి. ఏడాదిన్నర క్రితమే ఈ కాలువను జిల్లా మంత్రులు అట్టహాసంగా ప్రారంభించడం, రెండోసారి నీళ్లు విడుదల చేసినప్పుడే ఒక్కసారిగా కొట్టుకుపోవడంతో స్థానిక రైతులు సర్కార్‌పై మండిపడుతున్నారు.
శుక్రవారం ఏన్కూరు వద్ద, ఆదివారం వినోభానగర్ సమీపంలో సైడ్ బర్ములు కూలిపోవడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువ భారీగా కోతకు గురి కావడంతో పెద్ద గండ్లు పడే ప్రమాదమూ లేకపోలేదని, ఫలితంగా తమ పంటలు మునుగుతాయేమోనని భయపడుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు డిజైన్‌ను.. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనపెట్టింది. ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండానే, అనుమతులు లేకుండానే ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకున్నది. భూములు కోల్పోయిన భద్రాద్రి జిల్లా రైతులకు సాగునీరు ఇవ్వకుండానే రంగంలోకి దిగింది. జూలూరుపాడు మండల పరిధిలోని సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి వినోభానగర్ మీదుగా ఏనూరు సమీపంలోని ఎన్ఎస్పీ కాలువ వరకు రూ.80 కోట్లతో రాజీవ్ లింక్ కాలువ నిర్మించింది. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు మూడు నెలల్లోనే రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తిచేయించారు. కానీ, నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా గాలికొదిలేశారు. దీంతో రెండోసారి పారకానికే కాలువ సైడ్ బర్ములు కొట్టుకుపోయి పనుల్లో డొల్లతనాన్ని బయటపెట్టాయి.