టాలీవుడ్లో ఓ భారీ మల్టీస్టారర్‌కి రంగం సిద్ధమవుతున్నట్టు ఓ వార్త ఫిల్మ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున కాంబినేషన్లో ఈ సినిమా రూపుదిద్దుకోనున్నదని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారట. ఇప్పటికే ఈ సినిమాకు చెందిన కథాచర్చల్లో అనిల్ రావిపూడి పాల్గొంటున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్‌గారు’తో దర్శకుడు అనిల్ రావిపూడి భారీ విజయాన్ని అందుకున్నారు.
చిరంజీవి హీరోగా రూపొందిన ఆ సినిమా ద్వితీయార్ధంలో వెంకటేశ్ ఎంటర్ కావడం, అక్కడ్నుంచి ఆ ఇద్దరు సీనియర్ హీరోలనూ అనిల్ రావిపూడి హ్యాండిల్ చేసిన విధానాన్ని ఆడియన్స్ ఓ స్థాయిలో ఎంజాయ్ చేశారు. సదరు హీరోల అభిమానుల్లో ఎవరూ హర్ట్ కాకుండా అనిల్ ఆ కథను నడిపించిన తీరు నిజంగా అద్భుతం. అయితే.. ‘మన శంకరవరప్రసాద్’ సినిమాలో వెంకటేశ్ ప్రత్యేక పాత్ర మాత్రమే పోషించారు. త్వరలో సెట్స్‌కి వెళ్లనున్న చిరు, నాగ్ సినిమాలో ఇద్దరి పాత్రలూ సమప్రాధాన్యతతో ఉంటాయని, అసలైన మల్టీస్టారర్‌గా ఈ సినిమా తెరకెక్కనున్నదని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ఓ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఈచిత్రాన్ని నిర్మించనున్నదట. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.