మధిర, మార్చి 14 : మాల విద్యార్థులకు ఉద్యోగాలు! మాదిగ విద్యార్థులకు అరెస్టులా? తీరు మార్చుకోకుంటే కాంగ్రెస్కు పతనం తప్పదని ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి జడ్పీటీసీ నుండి ముఖ్యమంత్రి వరకు తన ఎదుగుదలకు కారణం మాదిగలే అని అనేక సభల్లో మాట్లాడిన ఆయన ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకురాకుండా పరీక్షల ఫలితాలు వెల్లడిస్తూ మాదిగ ఉద్యోగార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ లేకుండానే 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసి మాదిగలకు రేవంత్ సర్కార్ అన్యాయం చేసిందని, ఇప్పుడు గ్రూపు-1 గ్రూప్ -2, గ్రూప్ -3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మొదలగు పరీక్షల ఫలితాలు విడుదల చేస్తూ మరొకసారి రేవంత్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కార్ మాదిగలకు మాటలు చెప్పి మాలలకు ఉద్యోగాలు దోచిపెడుతుందన్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మాదిగలు దీక్షలు చేస్తుంటే, ఆ దీక్షలను అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారన్నారు.
ప్రజా పాలన అంటే అక్రమ అరెస్టులు, నియంతృత్వ విధానాలు అమలు చేయడమేనా అని ప్రశ్నించారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మాదిగలతో పెట్టుకుంటే మీ రాజకీయ భవిష్యత్ గల్లంతవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం వర్గీకరణ జరగాల్సిందే అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మేకల రాజా మాదిగ, జిల్లా నాయకులు కొండూరు రాజేశ్ మాదిగ, ఎంఎస్పీ సీనియర్ నాయకులు మరపాక ఆశీర్వాదం, మాదిగ మండల ప్రధాన కార్యదర్శి కణకపూడి పవన్ మాదిగ, మండల నాయకులు కనకాపూడి వెంకన్న మాదిగ, తడికమల్ల పుల్లయ్య మాదిగ, మండల కార్యదర్శి రామకృష్ణ మాదిగ పాల్గొన్నారు.