కారేపల్లి, మే 04 : గ్రామాల అభివృద్ధి కోసం క్షేత్రస్థాయి అధికారులైనా గ్రామ పంచాయతీ కార్యదర్శులు సర్పంచులతో సమన్వయంతో పని చేయాలని సింగరేణి (కారేపల్లి) మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులతో జన గణన, ఇతర అంశాలపై తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వరరావు, ఎంపీఓ మల్లెల రవీంద్రప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ.. పలు గ్రామ పంచాయతీలలో కార్యదర్శులు సర్పంచులతో సంబంధం లేకుండా బిల్లులు పాస్ చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా కొన్నిచోట్ల పాలకవర్గం తీర్మానం లేకుండా పంచాయతీ నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. పంచాయతీ నిధుల నుండి ఖర్చు చేసే ప్రతి పైసా పాలకవర్గానికి తెలియజేసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.