సంక్రాంతి సంబురాలు షురువయ్యాయి. సంప్రదాయ క్రీడ కోడిపందేలకు పందెంరాయుళ్లు సయ్యంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిషేధం ఉండడంతో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు పయనమయ్యారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పందెం బిర్రులు సిద్ధం చేస్తున్నారు. జూదరులను ఆకర్షించేందుకు నిర్వాహకులు కోడిపందేలతోపాటు మద్యం, బిర్యానీ పాయింట్లు, ఇతర జూదాలు ఏర్పాటు చేస్తున్నారు. పందేల వ్యసనంతో జూదరులు ప్రతి సంక్రాంతికి రూ.లక్షలు పోగొట్టుకోవడం పరిపాటిగా మారింది. తెలంగాణ పోలీసులు ఆంధ్రా సరిహద్దులో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి జూదానికి అడ్డుకట్ట వేస్తారో లేదో వేచిచూద్దాం.
-భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ అశ్వారావుపేట/ సత్తుపల్లి టౌన్, జనవరి 10
తెలంగాణ రాష్ట్రంలో కోడిపందేల నిషేధం కఠినంగా అమలవుతుండడంతో జూదరులు ఆంధ్రా వైపు పరుగులు తీస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలైన అశ్వారావుపేట, సత్తుపల్లికి ఆంధ్రా సరిహద్దు మండలాలు ఎక్కువగా ఉండడంతో ఏ వైపు చూసినా పందెం బిర్రులు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో కోడిపందేల ప్రియులు సరిహద్దులు దాటి వెళ్తున్నారు. అశ్వారావుపేటకు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, టి.నర్సాపురం, చింతలపూడి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల సరిహద్దులు అత్యంత సమీపంలో ఉంటాయి. ఊరు దాటితే సరిహద్దు మండలాల్లోకి వెళ్లిపోతారు. అందుకే కోడిపందేల కోసం పరుగులు తీస్తారు.
జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం, కామయ్యపాలెం, రామన్నగూడెం, కుక్కునూరు మండలం లంకాలపల్లి, కివ్వాక, దాచారం, కొండపల్లి, వేలేరుపాడు మండలం భూదేవిపేట, బుర్రతోగు, బండ్లబోరు, నాళ్లవరం, టి.నర్సాపురం మండలం మక్కినవారిగూడెం, సీతానగరం, మర్రిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసాపురం, పట్టెనపాలెం, అక్కంపేట, రెడ్డిగణపవరం, పుల్లేపూడి, చింతలపూడి మండలం శివాపురం, కోటపాడు, గండిపాడు, మల్లాయిగూడెం, ఆముదాలచెలక వంటి గ్రామాల్లో జరిగే కోడిపందేలు స్థానిక జూదరులకు అందుబాటులో ఉన్నాయి.
కోడి పందేల కోసం అశ్వారావుపేట, సత్తుపల్లిలో కొందరు వ్యాపారులు పుంజుల పెంపకం చేపడుతున్నారు. అశ్వారావుపేట, సత్తుపల్లి, దమ్మపేట మండలాల్లోనే కనీసం 70కి పైగా కోడిపుంజుల పెంపకం కేంద్రాలు ఉన్నాయి. కుటీర పరిశ్రమగా పందెం పుంజులను విక్రయించుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా రాష్ర్టాల నుంచి వచ్చి మరీ ఇక్కడ పందెం పుంజులను కొనుగోలు చేస్తారు. పామాయిల్, కొబ్బరి తోటలను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని పందెం పుంజులను పెంచుతారు. ఒక్కో పుంజు ధర రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది.
కోడిపందేల శిబిరాల వద్ద జూదగాళ్లు ఇతర ప్రమాదకరమైన జూదాలు కూడా నిర్వహిస్తున్నారు. అందర్ బాహర్, లోనబయట ఆట అత్యంత ప్రమాదకరమైన జూదం. గంటల్లో లక్షాధికారి బికారిగా, బికార్లు లక్షాధికారులుగా మారుతుంటారు. ఈ జూదానికి అలవాటుపడి అనేక కుటుంబాలు రోడ్డునపడ్డాయి. తెలంగాణ పోలీసులు పండుగకు రెండ్రోజుల ముందు తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల నుంచి ఆంధ్రా రాష్ర్టానికి వెళ్లే బోర్డర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తే జూదాన్ని కొంతవరకు కట్టడి చేయవచ్చు.
సంప్రదాయ ముసుగులో కోడిపందేలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెడతాం. కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లోని కోడిపందేల నిర్వాహకులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చాం. ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే ప్రజలు వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలి. సమాచారం చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
-రఘు, కల్లూరు ఏసీపీ