ఖమ్మం, డిసెంబర్ 28: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు పెచ్చుమీరాయని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలకులు, నాయకులు కలిసి అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నాని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం భట్టి ప్రాతినిథ్యం వహస్తున్న మధిర నియోజకవర్గంలో అయితే ఎమర్జెన్సీని మించిన అరాచకం కొనసాగుతోందని, భట్టి విక్రమార్క అండతో కాంగ్రెస్ గూండాలు బరితెగించి దాడులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్పై అధికార పార్టీ నేతల ఆడగాలు మితిమీరిన నేపథ్యంలో ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సండ్ర, లింగాల మాట్లాడారు. జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని, ముఖ్యంగా మధిరలో భట్టి అండ చూసుకొని కాంగ్రెస్ మూకలు రక్తపాతం సృష్టిస్తున్నాయని, అయినప్పటికీ పోలీసులు కూడా పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
చింతకాని రామకృష్ణాపురంలో బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసి కాలు విరగొట్టారని, అదే గర్వంతో వెళ్లి బీఆర్ఎస్ దిమ్మెకు కాంగ్రెస్ రంగులు వేశారని ఆరోపించారు. ఈ విషయాలపై బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు కేసు నమోదు చేయలేదని అన్నారు. కానీ, ఇదే మండలంలోని కొదుమూరులో బాధితులైన బీఆర్ఎస్ కార్యకర్తలపైనే పోలీసులు జులుం ప్రదర్శించారని అన్నారు. తెల్లవారుజామున బీఆర్ఎస్ నేతల ఇళ్లలోకి అక్రమంగా చొరబడి తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. బోనకల్లు మండలం ఆళ్లపాడులో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సంతోషంలో బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ చేసుకుంటుంటే.. కుంకుమ పడిందనే నెపంతో కాంగ్రెస్ గూండాలందరూ కలిసి బీఆర్ఎస్ కార్యకర్తల తలలు పగులగొట్టారని మండిపడ్డారు.
దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పక్షపాతం ప్రదర్శించారని, అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గారని అన్నారు. పైగా బీఆరెఎస్ నేతల ఫిర్యాదు ప్రతులపై తేదీలు మార్చి.. తిరిగి బీఆర్ఎస్ కార్యకర్తలపైనే అక్రమంగా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైరాలోనూ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ ఇటీవల ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఓటర్లను ప్రలోభపెట్టారని, తీగలబంజరలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌కు బలవంతంగా కాంగ్రెస్ కండువా కప్పి దౌర్జన్యం చేశారని విమర్శించారు.
రఘునాథపాలెం మండలం జింకలతండాలోనూ బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు తెగబడ్డాయని ఆరోపించారు. వీటన్నిటి వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. పోలీసులు నిస్పక్షపాతంగా ఉండి అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు పగడాల నాగరాజు, వాచేపల్లి లక్ష్మీరెడ్డి, ముత్యాల వెంకటప్పారావు, పోట్ల శ్రీనివాసరావు, చావా వేణుబాబు, మంకెన రమేష్, గురజాల హనుమంతరావు, బొడ్డు వెంకట రామారావు, కన్నెబోయిన కుటుంబరావు, పాము సిల్వరాజు, వడ్డే నరేష్, కోన నరేందర్‌రెడ్డి, పిన్నెల్లి శ్రీనివాస్, బొగ్గవరపు రాంబాబు, గుండ్లపల్లి శేషగిరిరావు, చిట్టిమోతు రాంబాబు, మహమ్మద్ రఫీ, నెమలి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.