ఖమ్మం, జనవరి 21: అబద్ధపు పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నదని, ప్రశ్నించే వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెడుతున్నదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆరోపించారు. ఇందులో కొందరు అధికారులు కాంగ్రెస్ నాయకులుగా వ్యవహరిస్తున్నారని, భవిష్యత్‌లో వారు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితర నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజులను సీఎం రేవంత్‌రెడ్డి తలపిస్తున్నారని, జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా ఎలాంటి ఉపయోగం లేదన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరులు, ఖమ్మం జిల్లాలో మల్లు నందిని, దయాకర్‌రెడ్డిలు రాజ్యాంగేతర శక్తులుగా పని చేస్తున్నారని ఆరోపించారు.
జూలూరుపాడు నుంచి ఏనూరు వరకు లింక్ కెనాల్‌ను మాత్రం రూ.200 కోట్లతో పూర్తి చేశారని, ఇందులో 8 నుంచి 12 శాతం కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. అలాగే రూ.13 వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి మేజర్ కాల్వలు, ఇతరత్రా పనులు 90 శాతం పూర్తయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.900 కోట్లకు అదనంగా ప్రతిపాదనలు సిద్ధం చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటో నీటిపాదరుల శాఖ మంత్రి సమాధానం చెప్పాలని తాతా మధు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కమీషన్ల పేరుతో దండుకోవడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చెప్పిన రేవంత్ మైలారం ప్రజలకు మద్దతు ఇచ్చిన హకుల నేత హరగోపాల్‌ను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. కేటీఆర్, హరీశ్‌రావులను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ను లేకుండా చేయాలని రేవంత్‌రెడ్డి పగటి కలలు కంటున్నాడని, ఇవేవీ నెరవేరవన్నారు.
పొంగులేటి అవినీతి గురించి సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను తాతా మధు ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ప్రజాపాలనలో పలు పథకాలకు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం మళ్లీ గ్రామసభల పేరుతో దరఖాస్తులు స్వీకరించడం ఏమిటని ప్రశ్నించారు. రేషన్ కార్డుల జాబితాను విడుదల చేసిన ప్రభుత్వం అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు ఇస్తున్నదని, కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికే ఇచ్చినప్పుడు ఇక గ్రామసభలు ఎందుకని ప్రశ్నించారు. ప్రతి పేదవారికి అన్ని సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి, శీలంశెట్టి వీరభద్రం, బల్లెం వేణుగోపాల్, ఖమర్ తదితరులు పాల్గొన్నారు.