కూసుమంచి, ఆగస్టు 6:వానకాలం సీజన్లో నాగార్జునసాగర్ ఆయకట్టుకు సాగునీటిని అందించాలనే నిర్ణయంలో సాగర్ డ్యాం నుంచి శుక్రవారం విడుదలైన కృష్ణా జలాలు సోమవారం రాత్రి పాలేరుకు చేరుకున్నాయి. దీంతో రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నాగార్జునసాగర్ కింద పాలేరు రిజర్వాయర్ పరిధిలో 2.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు.
గత యాసంగికి నీరు లేకపోవడంతో పూర్తిగా పంటలు వేయకుండా ఉన్న రైతులు.. ఈసారి నీరు పుష్కలంగా ఉండడంతో పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. ఈసారి వానకాలం, యాసంగి సీజన్లకు పూర్తి స్థాయిలో నీటిని ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సాగర్ నుంచి 2,160 క్యూసెక్కుల నీరు పాలేరుకు వచ్చి చేరుతోంది.
పాలేరు పాత కాలువకు 320 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి 275 క్యూసెక్కుల నీటిని, మిషన్ భగీరథకు 135 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి వస్తున్న ఇన్ఫ్లో.. ఒకటి, రెండు రోజుల్లో సుమారు 4 వేల వరకు వచ్చే అవకాశం ఉన్నందున పాలేరు నీటిమట్టం క్రమంగా పెరగనుంది.
పాలేరు రిజర్వాయర్ కింది ఎడమ కాలువ రెండో జోన్కు నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున కొద్ది రోజులు ఆలస్యంగా నీటిని వదలాలని అధికారులు నిర్ణయించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జిల్లాకు చెందిన సాగర్ ఆయకట్టు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఈ వారంలో నీటిని విడుదల చేయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
నేలకొండపల్లి, కూసుమంచి మండలాల రైతులకు సాగునీరు అందించే పాలేరు పాత కాలువ ప్రవాహాన్ని అధికారులు మంగళవారం 320 క్యూసెక్కులకు పెంచారు. దీని ఆయకట్టు కింది రైతులు ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఈఈ మంగలపుడి వెంకటేశ్వర్లు, డీఈ రత్నకుమారి కోరారు. ఈ మేరకు వారు మంగళవారం పాలేరు నుంచి నేలకొండపల్లి చివరి తూము వరకు ఈ కాలువను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.