ఖమ్మం వ్యవసాయం, జూలై 17 : రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. రూ.2 లక్షలలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు ఈ రుణమాఫీ వర్తించనున్నది. అయితే ఆగస్టు 15వ తేదీలోపు మొత్తం మూడు విడతలుగా రూ.లక్ష, రూ.1.50 లక్షలు, రూ.2 లక్షలు కేటగిరిల వారిగా రైతు ఖాతాల్లో జమ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. జిల్లావ్యాప్తంగా 2018 సంవత్సరం నుంచి 2023 డిసెంబర్ 9లోపు తీసుకున్న రైతులు సుమారుగా 3,73,157 మంది ఉండగా, వారికి రూ.4,307.58 కోట్లు మాఫీ అయ్యే అవకాశం ఉంది, అయితే తొలి విడతకు సంబంధించి నేడు రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు ప్రభుత్వం రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
దీంతో తొలివిడతలో 57,857 మంది రైతులు రుణవిముక్తులు కానున్నారు. రైతు రుణమాఫీ ప్రక్రియ వేడుకలకు సంబురంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున రైతులను సమీకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సాయంత్రం 4గంటలకు జిల్లాలోని 130 రైతువేదికల్లో రుణమాఫీ సంబురాలు జరగనున్నాయి. ఈ ప్రక్రియను రైతులు నేరుగా వీక్షించేందుకు గాను వ్యవసాయశాఖ అధికారులు ఎంపిక చేసిన రైతువేదికల్లో ఎల్ఈడీలను సిద్ధం చేశారు.